ప్రజాశక్తి -రాంబిల్లి
ఎన్‌ఎఒబి నిర్వాసితుల సమస్యలపై నేవీ నిర్వాసిత జెఎసి 8 గ్రామాల పెద్దలు గురువారం రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను కలిశారు. తమ సమస్యలను మంత్రికి విన్నవించారు. దీనికి స్పందించిన మంత్రి అమర్‌నాథ్ మాట్లాడుతూ ప్రతి రేషన్ కార్డు హోల్డర్‌కు రూ.13వేలు చొప్పున పది నెలల పాటు ఇస్తామని, మేజర్ సన్స్‌కి భృతి ఇచ్చే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఏడాదిలో రెండు నెలలు ఇవ్వమని, ఆ సమయంలో వేట నిషేధం ఉంటుందని తెలిపారు. ప్రతి బోటుకు రూ.2.50 లక్షలు ఇస్తామన్నారు.
మరో వైపు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండలంలోని వాడనర్సాపురం ఎన్‌ఎఒబి ప్రధాన గేట్ ముందు నేవీ నిర్వాసితులు చేపట్టిన ఆందోళన 109వ రోజు గురువారం కొనసాగింది. తమ న్యాయమైన డిమాండ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంపై నిర్వాసితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది గ్రామాలు నిర్వాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










