మంత్రి సహకారంతో ప్రతి వార్డును అభివృద్ధి చేస్తాం
స్పెషల్ గ్రాంట్ కింద డోన్ మున్సిపాలిటీకి 6 కోట్ల 40 లక్షలు మంజూరు
డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశైలరాజేష్
ప్రజాశక్తి-డోన్
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీలో ఉన్న 32 వార్డులను అభివృద్ధి చేస్తామని డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పెషల్ గ్రాంట్ కింద డోన్ మున్సిపాలిటీకి 6 కోట్ల 40 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు.డోన్ మున్సిపాలిటీకి నిధులు మంజురు చేయించినందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.మున్సిపాలిటీలో అన్ని వార్డులలో రోడ్లు,కాలువలకు సంబంధించి ఒక్కొక్క వార్డుకు 20 లక్షల రూపాయల చొప్పున అభివృద్ధి చేసేందుకు కేటాయిస్తున్నామని ఆయన తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా సచివాలయాలకు వచ్చిన నిధులపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.ఇప్పుడు వరకు 8 సచివాలయాలకు కోటి 60 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందని పనులు తుది దశకు చేరుకున్నాయని అలాగే నాలుగు సచివాలయాలకు 80 లక్షల రూపాయలు టెండర్ దశలో ఉన్నాయని తెలియజేశారు.పనులను తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మంత్రి పిఏ రమేష్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు,ఏఇ జనార్దన్,టీపిఓ తదితరులు పాల్గొన్నారు.










