మంత్రి కాకాణిని కలిసిన రామిశెట్టి
ప్రజాశక్తి-సీతారామపురం : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని మారంరెడ్డిపల్లి పిఎసిఎస్ చైర్మన్ రామిశెట్టి తిరుపతయ్య, డైరెక్టర్ గుండ్లపల్లి తిరుపాలు శుక్రవారం నెల్లూరులో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరులోని టౌన్ హాల్‌లో జిల్లాలోని సొసైటీ అధ్యక్షులు, డైరెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆయనను మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందన్నారు. జిల్లాలోని అత్యంత వెనుకబడిన మెట్ట ప్రాంతమైన సీతారామపురం మండలంపై ప్రత్యేక చొరవ చూపి మెట్టప్రాంత రైతాంగాన్ని ఆదుకునేలా సహకరించాలని కోరామన్నారు. అదేవిధంగా సొసైటీ తరఫున రైతులను ఆదుకునేలా తగిన నిధులను కల్పించాలని కోరామన్నారు. సీతారామపురం మండల అభివృద్ధికి సహకరించాలని, మండలలోని ప్రజలకు, రైతులకు శాశ్వత తాగు సాగునీరు అందించే విధంగా వెలుగొండ ప్రాజెక్టు, సీతారామ సాగర్, పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌లను త్వరితగతిన పూర్తయ్యేందుకు కృషి చేయాలని కోరామన్నారు. అదేవిధంగా మండలంలోని జరగాల్సిన పలు అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వచ్చామని ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని సానుకూలంగా స్పందించారన్నారు.










