చట్ట ప్రకారం 5వ షెడ్యూల్ ప్రాంతాన్ని ఆనుకొని 50 శాతం పైన గిరిజనులున్న గ్రామాలన్నీ ఏజెన్సీ కిందే లెక్క. వందల గ్రామాలను 5వ షెడ్యూల్ కాదంటున్నారు.100 శాతం గిరిజనులున్న గ్రామాలను కూడా షెడ్యూల్‌గా పరిగణించడం లేదు. అక్కడ గిరిజనుల చేతుల్లో భూమి జారిపోయి తమ సొంత భూమి లోనే కూలీలయ్యారు. భూమి గిరిజనేతర భూస్వాముల స్వాధీనం లోకి పోయింది. అదే 5వ షెడ్యూుల్‌లో వుంటే గిరిజనుల భూమి పోయేది కాదు.
కొన్ని నాన్-షెడ్యూల్ గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా ప్రకటించాల్సిందిగా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గత ఆగస్ట్‌లో ప్రకటన చేశారు. కేవలం మంత్రిగారు పేర్కొన్న 554 గ్రామాలనే గాక...అర్హమైన అన్నిటినీ షెడ్యూల్డ్ గ్రామాలుగా సిఫార్సు చేయాలని గిరిజనులు కోరారు. అలాగే చేస్తామని మంత్రి ప్రకటించారు. ఇచ్చిన మాట మరిచారో లేక గిరిజనేతరుల ఒత్తిడికి గురయ్యారో మంత్రి చెప్పిన మాట అమలు జరగలేదు. గ్రామాల జనాభా లెక్కలు, భౌగోళిక హద్దులు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. వారం పది రోజుల్లో చేయాల్సిన పని...సంవత్సరం దాటినా జరగక పోవడానికి కారణం మంత్రివర్యులే చెప్పాలి.
ప్రజల వీరోచిత చరిత్ర
రాజ్యాంగం 5వ షెడ్యూల్ ఆదివాసీ భూములకు రక్షణ కల్పించింది. కానీ 1950 నాటికే గిరిజనేతర భూస్వాములు ఏజెన్సీ లోని భూమినంతా ఆక్రమించేశారు. ఎవరి భూమినైతే కాజేశారో ఆ గిరిజనులతోనే వెట్టి చాకిరీ చేయించుకొన్నారు. పాలేర్లుగా పని చేయించుకున్నారు. గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను వ్యాపారులు కారు చౌకగా కొట్టేశారు. పిచ్చి కొలతలతో కిలోకి రెండు కిలోలు తూచి గిరిజనులను దోచేశారు. ఆ పరిస్థితుల్లో పల్లె రాములు, వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం తదితర ఉపాధ్యాయులు భద్రగిరి ఏజెన్సీలో గిరిజన సంఘాలు నిర్మించి, ప్రజలను కదిలించి పోరాటం నడిపారు. మొదట వెట్టికి వ్యతిరేకంగా, కూలి కోసం గిరిజన సంఘం పెట్టి పోరాటాలు చేశారు. ఓర్వ లేని భూస్వాములు సంఘాలను విచ్ఛిన్నం చేసే కుట్రలు చేశారు. చివరికి భూస్వాముల కాల్పులకు తెగబడ్డారు. భూస్వాముల కాల్పుల్లో కోరన్న, మంగన్న తొలి అమరులయ్యారు. వెంపటాపు సత్యం, కైలాసం, పంచాది కృష్ణమూర్తి, సోములు, పైల భీముడు వంటి నాయకులతో సహా దాదాపు 385 మంది ప్రభుత్వ తుపాకీ కాల్పుల్లో మరణించారు. వందల మంది పోరాట యోధులు సంవత్సరాల తరబడి జైళ్ల పాలయ్యారు. చౌదరి తేజేశ్వరరావు గారు 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించారు.
ఆ పోరాటానికి జడిసి ప్రభుత్వం 1/70 చట్టం చేసింది. ఏజెన్సీ ప్రాంతంలో భూస్వాములు కాజేసిన భూమిని కొన్ని గ్రామాల్లో గిరిజనులకు స్వాధీనం చేసింది. కొన్ని గ్రామాలను భూస్వామ్య పెత్తందార్లు ఆధీనంలో ఉంచుకున్నారు. లేకుంటే కురుపాం మండలంలో గుమ్మడిగడ్డ, గుమ్మలక్ష్మీపురం మండలంలో దుద్దుకల్లు, జియ్యమ్మవలస మండలంలో టి.కె.జమ్ము, పి.టి.మండ, కొమరాడ మండలంలో కెమిశీల, గునదతీలేసు తదితర పంచాయితీల్లోని గ్రామాలు షెడ్యూల్డ్ ఏరియా నుండి ఎలా వేరుపడతాయి? భద్రగిరి ఏజెన్సీ లోనే కాదు. రాష్ట్రమంతా ఇలాగే చేశారు. కావాలని దురుద్దేశంతో పాలకులు చేసిన పనే ఇది.
ఆ గ్రామాలను ఎలా మినహాయించారు ?
చట్ట ప్రకారం 5వ షెడ్యూల్ ప్రాంతాన్ని ఆనుకొని 50 శాతం పైన గిరిజనులున్న గ్రామాలన్నీ ఏజెన్సీ కిందే లెక్క. వందల గ్రామాలను 5వ షెడ్యూల్ కాదంటున్నారు. ఇదే విధంగా శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో చేశారు. ఏ చట్టం మినహాయింపు ఇస్తోందో చెప్పమనండి? 100 శాతం గిరిజనులున్న గ్రామాలను కూడా షెడ్యూల్‌గా పరిగణించడం లేదు. అక్కడ గిరిజనుల చేతుల్లో భూమి జారిపోయి తమ సొంత భూమి లోనే కూలీలయ్యారు. భూమి గిరిజనేతర భూస్వాముల స్వాధీనం లోకి పోయింది. అదే 5వ షెడ్యూల్‌లో వుంటే గిరిజనుల భూమి పోయేది కాదు.
గిరిజన యువతకు అన్యాయం
షెడ్యూల్ కాదనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం జీఓ-3 అమలు చేయడం లేదు. స్థానిక గిరిజన యువతకు అన్యాయం జరుగుతోంది. రాజ్యాంగం 342 అధికరణం ప్రకారం జాతాపు, సవర, కొండదొర, గదబ తదితర గిరిజన తెగలను ఎస్‌టి లుగా చెప్పింది. ఆర్టికల్ 244 క్లాజ్ 1 రాష్ట్రపతి ప్రకటించిన 5వ షెడ్యూల్ ఏరియాలో ఉన్న స్థానిక గిరిజనులకే జీఓ-3 వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. 5వ షెడ్యూల్ నుండి గ్రామాలను మినహాయించడంతో గిరిజన యువతకు అన్యాయం జరిగింది. విశాఖ ఏజెన్సీలో కొండ కుమ్మర్లకు కూడా తీరని అన్యాయం జరిగింది.
మైనింగ్‌కు, భూస్వాములకు సర్వే చేస్తారా !
సాలూరు, పాచిపెంట మండలాల్లో 22 పంచాయితీల్లో సర్వే చేయని భూములు ఉన్నాయి. గిరిజనులు వందల సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు దాటినా సర్వేయర్లు లేరని చెప్పి అధికార్లు గిరిజనులకు పట్టాలు ఇవ్వలేదు. వంద సంవత్సరాలుగా సాగులో ఉన్న గిరిజనుల భూములకు సర్వే చేసి పట్టా ఇవ్వడానికి సర్వేయర్లు లేరంటున్నారు ప్రభుత్వ అధికారులు. అయితే, ఏ హక్కూ లేని వ్యక్తి కోరిన వెంటనే కుడుమూరు ప్రభుత్వ భూమిలో సర్వేకు అరడజను మంది సర్వేయర్లతో సిద్ధపడడాన్ని ఏమనాలి? అదే ప్రాంతంలోని తామరకొండ, బోడికొండ, బడిదేవరకొండ, శిఖపరువు షెడ్యూల్డ్ భూమిని గనుల తవ్వకాలకు సర్వే చేయగల ప్రభుత్వం...గిరిజనుల భూమి సర్వే చేసి పట్టాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నది? శిఖపరువు మైనింగుకు ప్రభుత్వ అనుమతి లేకుండా కాంట్రాక్టరు రోడ్డు ఎలా వేస్తున్నాడు?
సిగళ్లు లేవు, రోడ్లు లేవు, టీచర్లు లేరు
గత కొన్ని సంవత్సరాలుగా ఆన్‌లైన్ ఒక పెద్ద సమస్యగా మారింది. ప్రతి పని ఆన్‌లైన్ లోనే చేయాలి. రేషన్ కార్డు, పెన్షన్, ఉద్యోగానికి దరఖాస్తు, అంగన్వాడీ, స్కూలు పిల్లల హాజరు, సాగు భూమి లెక్కలు, చదువుకు సీటు కోసం ఒకటేమిటి అన్నీ ఆన్‌లైన్‌లో చేయాలి. ఏజెన్సీలో సిగళ్లు వుండడం లేదు. మైదానంలో పట్టణాలకు వెళ్లి భారీగా డబ్బు ఖర్చు పెట్టి చేయించుకోవాల్సి వస్తోంది. సెల్ టవర్లు ఉంటే గిరిజనులకు ఈ బాధ తప్పుతుంది. కొండ కోనల్లో సిగల్ రావాలంటే మైదానంలో కంటే ఎక్కువ సెల్ టవర్లు కావాలి. చిన్న పని కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
వందల గ్రామాలకు రోడ్లు లేవు. ఉన్న రోడ్లకు మరమ్మతులు లేవు. రోడ్లు ఉన్నా ఆర్‌టిసి గిరిజన గ్రామాలకు బస్సులు నడపదు. సెటిలర్ల కోసం దూర ప్రాంతాలకు బస్సులు నడిపే ఆర్‌టిసి గిరిజన గ్రామాలకు మాత్రం బస్సులు నడపదు. టీచర్లు, ఇతర ఉద్మోగులు వెళ్లి రావడం కష్టం. అక్కడ వుండేందుకు వసతి లేదు. గిరిజన ప్రజలు పనుల కోసం, చదువు కోసం, వైద్యం కోసం వెళ్ళి రావడం కష్టమే. తీవ్రమైన ఆర్థిక భారం కూడా. ఇప్పటికీ రోగులను డోలీపై మోయాల్సి రావడం దారుణం.
కరోనా కారణంగా విద్యా రంగం తీవ్రమైన ప్రభావానికి గురైంది. విద్యా సంస్థలు తెరిచినా స్కూల్లో టీచర్లు లేరు. డిఎస్‌సి తీయలేదు.స్పెషల్ డిఎస్‌సి వేయడం లేదు. కనీసం కాంట్రాక్టు టీచర్లను నియమించ లేదు. ఆన్‌లైన్ చదువుకు గిరిజనుల దగ్గర ట్యాబ్ లు, స్మార్ట్ ఫోన్లు లేవు. ఉన్నా సిగళ్లు రావు. ఈ పరిస్థితుల్లో గిరిజనుల విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనే ప్రయత్నం కూడా లేదు.
భూమిని, రిజర్వేషన్లను కాపాడుకోవాలి
ఆరేళ్లలో మోడీ 5 లక్షల ఎకరాల 5వ షెడ్యూల్ భూమిని కార్పొరేట్లకు ఇచ్చేశారు. కరోనా సమయంలో 41 బొగ్గు గనులను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. ఒడిషాలో బాక్సైట్ గనులు కార్పొరేట్లకు ఇచ్చేశారు. మోడీ విద్యా విధానంలో ఎక్కడా రిజర్వేషన్ అనే ప్రస్తావనే లేదు. గిరిజనులు, దళితులు, బిసి లు, మహిళలు, వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాల్సిన విద్య, వైద్యం, బ్యాంకులు, విద్యుత్, రైల్వే, ఇన్సూరెన్స్, రక్షణ, అంతరిక్షం, వ్యవసాయం, విశాఖ స్టీల్ తో సహా ప్రభుత్వ పరిశ్రమలు సర్వం మోడీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తున్నది.అన్నీ ప్రైవేట్ చేస్తే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు అమలు చేసేది ఎక్కడీ కనుక భూమిని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి.
కోర్టు తీర్పులతో ఎవరికి మేలు ?
కొంత మంది యువకులు ఏజెన్సీ సర్టిఫికెట్ కోసం కోర్టు వైపు చూస్తున్నారు. ఇటీవలి కాలంలో వెలువడిన కోర్టు తీర్పులు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. జీఓ-3 చెల్లదనే సుప్రీంకోర్టు తీర్పు చూసినా, రిజర్వేషన్లు సమీక్ష చేయాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినా, ఎస్‌సి/ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే సుప్రీం కోర్టు సూచనలు చూసినా, తరతరాలుగా ఫారెస్ట్ భూమిలో సాగు చేస్తున్నా పట్టా లేని గిరిజనులను భూమి నుండి, అడవి నుండి తరిమేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన మార్గదర్శకాలు చూసినా అదే అభిప్రాయం కలుగుతుంది. కాశ్మీరీ ప్రజల భూమికి రాజ్యాంగం రక్షణ కల్పించే 35 ఎ ఆర్టికల్‌ను మోడీ రద్దు చేసినా సుప్రీంకోర్టు కాశ్మీర్ ప్రజలకు న్యాయం చేయకపోవడం చూస్తున్నాం.
పోరాడి సాధించుకున్న హక్కులు
గిరిజనులు అహోరాత్రులు కష్టపడి భూములను సాగు లోకి తెస్తే గిరిజనేతరులు స్వాధీనం చేసుకొని గిరిజనులను మరింత లోతైన అడవుల్లోకి నెట్టేశారు. సంతాలులు, గోండులు, వర్లీలు ఒకరేమిటి దేశంలోని అన్ని తెగల గిరిజనులు...మొదట రాజులు తరువాత ఇంగ్లీష్ పాలకులతో పోరాడితేనే...ఆదివాసీల భూమికి రాజ్యాంగం 5వ షెడ్యూల్ రక్షణ కల్పించింది. ఆ పోరాటాల ఫలితమే స్వతంత్రానంతరం రాజ్యాంగం విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించింది. పాలకులు ఉత్తిపున్యానికి ఇచ్చిన హక్కులు కావివి.
ఇప్పటికైనా ఏజెన్సీని ఆనుకొని 50 శాతం గిరిజనులున్న గ్రామాలను షెడ్యుల్ గ్రామాలుగా ప్రకటించి భూమిని గిరిజనులకు ఇవ్వాలి. జీఓ-3 అమలు చేసి స్థానిక యువతకు రిజర్వేషన్ కల్పించాలి. భూస్వామ్య పెట్టుబడిదారీ వర్గాలు గిరిజనుల్లో కొంతమందికి పదవులు ఇచ్చి తమ వెంట తిప్పుకుంటున్నాయి. పదవులు పొందిన దళిత, గిరిజన నాయకులు వైసిపి, టిడిపి, బిజెపి వంటి పార్టీలు చెప్పింది వినకపోతే రేపు మరల పదవి రాదని రాజీ పడుతున్నారు. (చంద్రబాబు 1/70 చట్టాన్ని సవరించే ప్రయత్నాన్ని సున్నం రాజయ్య (సిపిఎం) మినహా అందరూ అంగీకరించారు). భూమి సాధనకు పోరాటమే మార్గం. దగ్గర దారులు లేవు.
(వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)
ఎం. కృష్ణమూర్తి











