ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : ఇప్పటికే జిల్లాలోని జ్యూట్ పరిశ్రమలు మూతపడ్డాయి. ఒక్కగానొక్క భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరణ పేరుతో మూసివేశారు. నష్టాలపేరిట ఎన్‌సిఎస్ సుగర్స్‌ను మూసివేయింప జేయడంతోపాటు దానికి సంబంధించిన ఆస్తులు దారదత్తం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో సుమారు 50వేల కుటుంబాలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోయాయి. ఒకప్పుడు గౌరవంగా బతికే కుటుంబాలు ఇప్పుడు పుట్టెడు కష్టాల నడుమ బతుకీడుస్తున్నాయి. రోజుకు 8గంటలపాటు పనిచేస్తూ నిబ్బరంగా బతికే జ్యూట్ కార్మికులు పొట్టచేతపట్టుకుని ఊరుగాని ఊళ్లకు వలసపోయారు. కొంతమంది సెక్యూరిటీ గార్డుల అవతారమెత్తారు. ఇదంతా గడిచిన దశాబ్ధ కాలంలో కళ్లెదుటే కనిపిస్తున్నప్పటికీ మంత్రి స్పందించలేదు. తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపుతో ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో 36 ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలు ఉండగా, ఒక్క విజయనగరంలోనే 21 పరిశ్రమలు ఉన్నాయని అన్నారు. ఇందులోనూ మంత్రి బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా ఫెర్రో పరిశ్రమలపై ప్రత్యక్షంగా 60వేలు, పరోక్షంగా 6 లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఫెర్రో క్రోం తయారీలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల విద్యుత్ భారంతో పరిశ్రమలు చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందుల నడుమ నడుస్తున్నాయి. మార్చి 31 వరకు ఈ పరిశ్రమలకు ఒక యూనిట్ విద్యుత్ ఛార్జీ రూ.4.95 ఉండగా, ఏప్రిల్ 1 నుంచి ఒక యూనిట్ విద్యుత్ ఛార్జీ రూ.8.55లకు ప్రభుత్వం పెంచింది. జార్ఖాండ్ తదితర రాష్ట్రాల్లో ఫెర్రో పరిశ్రమలకు అక్కడి ప్రభుత్వాలు రూ.4కు, ఖతార్ వంటి దేశాల్లో రూ.3చొప్పున విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలపై రాయితీలు ప్రకటించాల్సిన పరిస్థితుల్లో భారాన్ని మరింతగా మోపడంతో పలు పరిశ్రమలు మూతపడ్డాయి. బొబ్బిలి గ్రోత్ సెంటర్ లో 5, గరివిడి ప్రాంతంలో 3, కొత్తవలస ప్రాంతంలో 1 ఇప్పటికే మూతపడగా, గరివిడి ఫేకర్ సహా మరికొన్ని పరిశ్రమల్లో ఉత్పత్తిని తగ్గించాయి. మరికొన్ని మూసివేత దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఇటువంటి పరిశ్రమల్లో ప్రభుత్వంపై ఒత్తిడి చేసి పరిశ్రమలను కాపాడాల్సిన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ 'లాభాలు వచ్చినప్పుడు ఎవరికైనా ఇచ్చారా?' అంటూ చేసిన వ్యాఖ్యల పట్ల కార్మికులు మండిపడుతున్నారు. చిత్తశుద్ధి ఉంటే యాజమాన్యాలకు నిర్థిష్టమైన భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి వైఖరి ఇలాగే ఉంటే ప్రభుత్వాన్నే రోడ్డుపైకి ఈడ్చాలంటూ ఇటీవల నగరంలో జరిగిన ఫెర్రో ఎల్లాయీస్ సదస్సు నిర్ణయించింది. ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమల పరిరక్షణకు ఈనెల 7న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టాలని, అనంతరం వారం రోజులపాటు పరిశ్రమల వద్ద నిరసన దీక్షలు చేపట్టాలని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే ఆగస్టు చివరి వారంలో ఏకంగా చలో అసెంబ్లీ నిర్వహించాలని సదస్సు ఏకగ్రీవంగా తీర్మానిం చింది. మంత్రి బొత్స వైఖరిని కూడా తప్పుపట్టింది










