Nov 22,2022 00:07

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ

ప్రజాశక్తి-అనకాపల్లి
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అవినీతిలో రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రి అభివృద్ధిపై సమాధానం చెప్పలేక మంత్రి తమ సవాళ్లను స్వీకరించలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. ఆసుపత్రిలో అడుగడుగున అవినీతి రాజ్యమేలుతుందని, వైసిపి నాయకులకు సూపరింటెండెంట్‌ కీలుబొమ్మగా మారారని విమర్శించారు. మంత్రికి పేదల ఆరోగ్యం కన్నా కమీషన్ల పైనే శ్రద్ధ ఎక్కువన్నారు. డీజిల్‌, మందులు, కాంట్రాక్టు కార్మికుల జీతాల్లో కూడా కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇంత అవినీతి జరుగుతున్నా, దీనిపై విజిలెన్స్‌, ఏసీబీ, కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లినా వారు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు మళ్ల సురేంద్ర, పోలవరపు త్రినాధ్‌, పచ్చికూర రాము, తలారి కాశి నాయుడు, సిదిరెడ్డి శ్రీనివాసరావు, సిరసపల్లి సన్యాసిరావు, కాండ్రేగుల సతీష్‌, నందారపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.