Feb 20,2021 06:48

కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గురువారం దేశవ్యాప్తంగా చేపట్టిన రైల్‌ రోకో విజయవంతం కావడం కర్షకుల పోరుబాటలో మరో మైలురాయి. నిద్ర నటిస్తున్న మోడీ సర్కార్‌కు మరో కుదుపు. కేంద్ర ప్రభుత్వ కుయుక్తులను, కుట్రలను ఎప్పటికప్పుడు పటాపంచలు చేస్తూ ఉద్యమబాటలో అలుపెరగక పోరాడుతున్న అన్నదాతల స్ఫూర్తి అమోఘం. అభినందనీయం. దేశమంతటా అన్నదాతలకు సంఘీభావంగా ప్రజానీకం కదులుతున్నా కర్షకుల సమస్యలను పరిష్కరించే దిశగా మోడీ సర్కార్‌ ఇసుమంతైనా స్పందించకపోవడం సిగ్గుచేటు.


దేశం నలుమూలల్లో ఏ ఒక్కచోటా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా రైల్‌రోకో విజయవంతం కావడం అన్నదాతల శాంతియుత పోరాటతీరుకు ప్రతీక. ఆరుగాలం చెమటోడ్చి తమ కోసం కష్టించే రైతన్న పట్టాల మీదకొచ్చి పోరాడుతుంటే రైళ్లలోని ప్రయాణీకులు గంటల తరబడి సహనంతో వేచివుండటమే కాదు, సంఘీభావంగా నినదించడం కూడా అనేక చోట్ల కనిపించింది. రైతు సంఘాల నాయకులు ప్రయాణీకులకు త్రాగు నీరు, అల్పాహారం అందించి ప్రయాణికులు ఇబ్బందులకు గురికాకుండా సేవలందించారు. పరస్పర సంఘీభావంతో సహృదయాలతో ముందుకు సాగిపోతున్న ఈ పోరాటం విశాల ప్రజానీకం ఐక్యతకు ఒక సంకేతం. పంటలు కోతకు వచ్చిన నేపథ్యంలో ఇక ఆందోళన పథాన్ని వీడి రైతులు వెనక్కి వెళ్తారనే కేంద్ర ప్రభుత్వ అంచనాలను రైల్‌రోకో తలకిందులు చేసింది.


కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు రైల్‌రోకోకు విశేష మద్దతు లభించిందంటే..దానికి రైతన్నలపై సహజంగా ఉండే సానుభూతి ఒక్కటే ప్రధానం కాదు..బిజెపి వినాశకర విధానాలపై దేశ ప్రజల్లో వేళ్లూనుకుంటున్న అసంతృప్తికి అది ప్రతీక కూడా. పంజాబ్‌లో ఇటీవల పురపాలక సంస్థలకు ఎన్నికలు జరిగితే అక్కడి ప్రజానీకం కాషాయ దళానికి కొర్రు కాల్చి వాతలేసింది. ఢిల్లీలో నిర్విరామంగా సాగిస్తున్న అన్నదాతల శాంతియుత పోరాటాన్ని చీల్చడానికి కేంద్రం ఎర్రకోట సాక్షిగా సాగించిన కుట్రలకు సమాధానంగానే బిజెపికి పంజాబ్‌ ప్రజలు తలంటారు. సంయుక్త కిసాన్‌ మోర్చా ఇచ్చిన రైల్‌రోకో పిలుపునకు ఆసేతుహిమాచలం ప్రజానీకమంతా స్పందించి బాసటగా నిలుస్తున్నా మోడీ సర్కార్‌ మాత్రం రైతులపై విద్రోహుల ముద్ర వేయడం, చీలికలు తీసుకొచ్చి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలనే తలంపుతో కుట్రలకు పాల్పడుతోంది.


అన్నదాతలకు అండగా అంతర్జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపిన యువ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్‌ను కేంద్ర సర్కారు ఆక్షేపించింది. భారత్‌లో పర్యావరణ హితానికి ప్రచారోద్యమం సాగిస్తూ ఇప్పుడు రైతన్నలకు మద్దతుగా నిలిచిన బెంగళూరుకు చెందిన స్వచ్ఛంద కార్యకర్త దిశా రవిపై దేశద్రోహం కేసులను బనాయించి ఎంతగా వేధిస్తున్నదీ చూస్తున్నాం. అన్నదాతల పోరాటంపై కార్పొరేట్‌ మీడియా చిన్నచూపు చూస్తూ సింగిల్‌ కాలమ్‌ వార్తలకు పరిమితమైన నేపథ్యంలో రైతుల ఉద్యమానికి విస్తృత కవరేజీ ఇస్తూ వాస్తవాలను దేశ ప్రజలకు తెలియజేస్తున్న ప్రత్యామ్నాయ మీడియాపై మోడీ సర్కార్‌ కత్తి కట్టింది. 'ద హిందూ' పత్రికకు వాణిజ్య ప్రకటనలేవీ రాకుండా చేయడం, 'ద వైర్‌' యాజమాన్యంపై అక్రమ కేసులు బనాయించడం, 'న్యూస్‌ క్లిక్‌' సంపాదక బృందంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ (ఇ.డి)తో అర్ధరాత్రి వేళల్లో సోదాలు జరిపించడం సిగ్గుమాలిన బెదిరింపులు మినహా మరొకటి కాదు. వాస్తవాలు ప్రజలకు తెలిసిపోతే తమకు పుట్టగతులుండవనే భయంతోనే ప్రభుత్వం ఈ దుర్మార్గమైన దాడులకు తెగబడుతోంది. మోడీ ప్రభుత్వం ప్రజలను ఒక సారి మోసగించవచ్చేమో కానీ ఎల్లకాలం మోసగించాలనుకుంటే మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. ఈ దేశానికి కీలకమైన వ్యవసాయ రంగాన్ని ఛిద్రం చేయాలని చూస్తే పాలకుల కూసాలు విరగడం ఖాయం. ఇకనైనా మోడీ సర్కార్‌ మంకు పట్టు వీడి నల్ల చట్టాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి.