
ఒకనాడు కేవలం ఆఫ్రికా ఖండానికే పరిమితం అనుకున్న మంకీ పాక్స్ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని ఆవరించనుందా? కరోనా మాదిరి మహమ్మారిగా మారనుందా? నివృత్తి జరిగేంతవరకు అనేక అనుమానాలు, సందేహాలు వెలువడుతూనే ఉంటాయి. తెలుగు నాట మసూచి, పెద్ద అమ్మోరు, స్ఫోటకంగా పిలిచిన వైరస్‌కు ఇది సోదరి. ప్రస్తుతానికి అలాంటి తీవ్ర హెచ్చరికలు వెలువడలేదుగానీ కరోనా నేపథ్యంలో అనేక వార్తలు భయపెడుతున్నాయి. ఇది పాక్స్ జాతికి చెందిన వైరస్‌గా కోతుల్లో గుర్తించినందున దానికి 'మంకీ పాక్స్' అని పేరు పెట్టారు. ఇది మసూచికి సంబంధించిందైనప్పటికీ అంతటి ప్రమాదకారి కాదని కొందరు అంటున్నా, అప్పుడే నిర్ధారించలేమని మరికొందరు హెచ్చరిస్తున్నారు. వరియోలా మేజర్, వరియోలా మైనర్‌గా పిలిచిన వైరస్‌లు మసూచి కారకాలు, ఇది గత శతాబ్దిలో 30 కోట్ల మందిని, అంతకు ముందు మరో ఇరవై కోట్ల మందిని బలి తీసుకుందని అంచనా. పదహారవ శతాబ్దిలో బ్రిటన్‌లో దీన్ని స్మాల్ పాక్స్ అని పిలిచారు. 1980లో ప్రపంచంలో పూర్తిగా నిర్మూలించినట్లు ప్రకటించి ఈ వైరస్ ఇప్పుడు అమెరికా, రష్యాల్లోని రెండు పరిశోధనా సంస్ధలలో మాత్రమే ఉంది. కరోనా, ఉక్రెయిన్ సంక్షోభం, మంకీ పాక్స్ నుంచి ప్రపంచం గట్టి సవాళ్లను ఎదుర్కొంటున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అధనోమ్ గెబ్రియోసస్ జెనీవాలో జరిగిన సమావేశంలో చెప్పారు.
ఐరోపా, ఉత్తర అమెరికా, ఆసియా ఖండాల్లోని 15 దేశాల్లో మే నెల మూడవ వారం వరకు 120 నిర్ధారణ లేదా అనుమానాస్పద కేసులు నమోదైనాయి. ఒక ప్రాంతం లోని జనాభాతో మరొక ప్రాంత జనాభాకు సంబంధం లేనప్పటికీ ఇన్ని చోట్ల వ్యాప్తి చెందటం ఆసక్తి కలిగిస్తున్నదని ఆఫ్రికా లోని కాంగోలో పదేళ్ల క్రితం ఈ వైరస్ మీద పరిశోధన చేసిన అమెరికా శాస్త్రవేత్త అనే రిమోయిన్ చెప్పారు. ఇది మసూచి సంబంధిత వైరస్ కనుక కరోనా మాదిరి వ్యాప్తి చెందదని మరో శాస్త్రవేత్త జే హూపర్ అన్నారు. ఇది సోకిన వ్యక్తులు దగ్గినపుడు అతి సమీపంలోని వారికి మాత్రమే సోకే అవకాశం ఉందన్నారు. ఇది సోకిన వారు ఎలాంటి చికిత్స లేకుండానే కొన్ని వారాల తరువాత ఎక్కువ మంది కోలుకుంటారని కూడా హూపర్ అంటున్నారు. ఇది ప్రాథమిక దశలో ఉన్నందున ఇప్పటికిప్పుడే నిర్ధారణగా దేన్నీ చెప్పలేమని మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని మరో వైరాలజిస్టు గుస్తావ్ పాలాసియో చెప్పారు. ఆఫ్రికా దేశాల్లో ఇది కనిపించినప్పటికీ ఐరోపా, అమెరికాల్లో వ్యాప్తి చెందటానికి ఉన్న సంబంధం ఇంకా తెలియలేదు. ప్రస్తుతానికి మన దేశంలో ఈ వైరస్ దాఖలాలు లేవు. సోకిన దేశాల నుంచి వచ్చిన వారి మీద నిఘా వేసి, లక్షణాలున్నవారి నుంచి రక్త నమూనాలను సేకరించాలని ఆదేశించారు. స్త్రీ-పురుషుల సంపర్కం ద్వారా మంకీ పాక్స్ వ్యాపించదని భావించిన ఈ వైరస్ ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చుకొనేట్లు చేసింది. బ్రిటన్‌లో వెలువడిన కేసులలో ఎక్కువ మంది స్వలింగ, ద్విలింగ సంపర్క పురుషుల్లో కనిపించింది.
సంబంధం లేని దేశాల జనాభాలో ఇది కనిపించటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మసూచి (స్మాల్ పాక్స్)ను పూర్తిగా నిర్మూలించినందున దాని సోదరి మంకీ పాక్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంతకాలంగా భావిస్తున్నారు. బలహీనంగా, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారిలో మంకీ పాక్స్ సోకవచ్చని భావిస్తున్నారు. కాంగోలో కనిపించిన తరువాత 39 ఏళ్లకు 2017 నుంచి నైజీరియాలో రెండు వందల నిర్ధారిత, ఐదు వందల అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి. 2003లో ఘనా నుంచి దిగుమతి చేసుకున్న ఎలుకల నుంచి అమెరికా లోని ఇల్లినాయిస్ కుక్కలకు, ఆ తరువాత 70 మంది స్థానికులకు సోకింది.
బ్రిటన్‌లో తొలి కేసు నైజీరియా వెళ్లి వచ్చిన పురుషుడిది కాగా తరువాత వారికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదు. అమెరికా లోని మసాచుసెట్స్‌లో ఒకరికి నిర్ధారణైంది. అతను ఇటీవలే కెనడా వెళ్లి వచ్చినట్లు తేలింది. దాంతో 119 మిలియన్ డాలర్ల విలువగల మంకీ పాక్స్ వ్యాక్సిన్లు సరఫరా చేయాలని అమెరికా సర్కార్ కోరిందని బవేరియన్ నోర్డిక్ కంపెనీ ప్రకటించింది. అంతకు ముందే ఇచ్చిన ఆర్డర్‌తో కలిపితే 299 మిలియన్ డాలర్లని, కోటీ 30 లక్షల డోసుల మేర కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. వీటిని 2024-25లో సరఫరా చేస్తారు. మంకీ పాక్స్ సోకినవారిలో నూటికి పది మంది మరణించినట్లు గత సమాచారం వెల్లడిస్తున్నది.
పరిశోధనకు తెచ్చిన కోతుల్లో 1958లో మంకీ పాక్స్ కనిపించింది. మానవుల్లో తొలి కేసు 1970లో నమోదైంది. ఇది వివిధ పద్ధతుల్లో , రకరకాలుగా సోకే అవకాశం ఉంది. వైరస్ ఉన్న జంతువు మనిషిని కరచినా, దాని రక్తం, స్రవించిన ద్రవాలను ముట్టుకున్నా, ఈకలను తాకినా రావచ్చు. ఎలుకలు, ఉడుతలు, వైరస్ సోకిన జంతు మాంసాన్ని...సరిగా ఉడికించకుండా తిన్నా ఈ వైరస్ సోకుతుంది. సంభోగం ద్వారా కూడా సంక్రమించవచ్చు. మనుషుల్లో జ్వరం, కండరాల నొప్పి, దద్దుర్లు, గాయాలు కావటం, చలి వంటి లక్షణాలు వుంటాయి. సాధారణంగా వైరస్ సోకిన తరువాత ఐదు నుంచి 21 రోజుల్లో లక్షణాలు కనిపించవచ్చు.
ఐరోపాలో స్మాల్ పాక్స్, మంకీ పాక్స్, కౌ పాక్స్ చికిత్సకు ''టెకోవిరిమాట్'' అనే ఔషధాన్ని అనుమతించారు. దాన్ని టిపాక్స్ పేరుతో విక్రయిస్తున్నారు. అమెరికాలో స్మాల్ పాక్స్‌కు మాత్రమే అనుమతించారు. తాజాగా వ్యాపిస్తున్న మంకీ పాక్స్ పాతదేనా కొత్త రకమా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. అనేక దేశాల్లో కనిపించిన తీరును చూస్తే వేగంగా వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు.దీని అర్ధం 'కరోనా మాదిరి వేగంగా విస్తరిస్తుందని కాదు' అని కూడా అంటున్నారు.
ఎం.కె.ఆర్