Aug 08,2023 20:58

లేఅవుట్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గిరీష, జెసి, ఇతర అధికారులు

ప్రజాశక్తి-ఓబులవారిపల్లి(పుల్లంపేట)
మంగంపేట నిర్వాసితులకు కేటాయించిన లేఅవుట్‌లో మౌలిక సదుపాయాల నిర్మాణాలను ప్రారంభించాలని, నిర్వాసితుల పరిరక్షణ కమిటీ కోరిన విధంగా మాస్టర్‌ ప్లాన్‌ను మార్పు చేయడానికి సిద్ధమని కలెక్టర్‌ గిరిష తెలిపారు. మంగళవారం మంగంపేట గ్రామ పంచాయతీలోని నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, ఆర్థిక సాయం, వారికి కేటాయించిన స్థలంలో మౌలిక సదుపాయాల నిర్మాణం, మాస్టర్‌ ప్లాన్‌ గురించి అధికారులతో పరిరక్షణ కమిటీ సభ్యులతో చర్చించడానికి నిర్వాసితులకు కేటాయించిన బుక్కారంపల్లి వద్దనున్న లేఅవుట్‌ను సందర్శించారు. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ నిర్వాసితులకు కేటాయించిన స్థలంలో సిసి రోడ్డు, డ్రెయినేజీ, పాఠశాల భవనం, విద్యుత్‌ లైన్లు, ఆటస్థలం, శ్మశానవాటిక, పార్క్‌ తదితర మౌలిక వసతుల నిర్మాణాలను ప్రారం భించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్‌ అండ్‌బి, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇలు, తదితర అధికారులు లేఅవుట్‌లో ఏఏ సౌక ర్యాలు ఎక్కడ ఉంటాయో కలెక్టర్‌కు వివరించారు. లే అవుట్లలో ఇళ్లను కట్టుకోవ డానికి సౌకర్యంగా లేని ప్రాంతంలో ఇళ్ల స్థలాలను కేటాయించవద్దని ఆ స్థలాల ను వేరే విధంగా ఉపయోగించుకోవాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. అనంతరం ఎపిఎండిసి అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసులో మంగంపేట నిర్వాసితుల కమిటీతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాస్టర్‌ ప్లాన్‌లో వివిధ మార్పులను చేయమని కలెక్టర్‌ను కోరారు. వారు కోరిన విధంగా మార్పులు చేసేందుకు కలెక్టర్‌ సమ్మతించారు. కమిటీ సభ్యులు కోరిన విధంగా మార్పులు చేసి మాస్టర్‌ ప్లాన్‌ను తయారు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం లే అవుట్‌ పూర్తి చేసి దానికి అనుసంధానంగా అంగన్వాడీ కేంద్రం ఆర్టీసీ బస్సుస్టాప్‌ తదితర ఇతర సౌక ర్యాలు కూడా అందజేస్తామని కమిటీ సభ్యులకు తెలియజేశారు. నిర్వాసితులకు ఆర్థిక సాయం గురించి కమిటీ సభ్యులు కోరగా మినరల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ వారు డబ్బును అకౌంట్‌లోకి జమ చేయగానే నిర్వాసితులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని తెలియజేశారు. దీనికి కావాల్సిన ఫామ్‌ సి మరియు ఫామ్‌ సిసిలను నిర్వాసితుల దగ్గర నుంచి త్వరితగతిన తీసుకోవాలని తహశీల్దార్‌కు కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, రాజంపేట ఆర్‌డిఒ రామకృష్ణారెడ్డ్డి, ఆర్‌అండ్‌బి, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇలు, రాజంపేట, ఓబులవారిపల్లె తహశీల్దార్లు పాల్గొన్నారు.