ఓబులువారిపల్లి : మంగంపేట ముంపు బాధితులకు కేటాయించిన అర్‌అర్-5 లేఅవుట్ అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ గిరిష తెలిపారు. శుక్రవారం మండలంలోని మంగంపేట గ్రామ పంచాయతీ కాపువల్లి ముంపు బాధితులకు కేటాయించిన ఆర్‌ఆర్-5, లే అవుట్‌ను రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుతో కలిసి కలెక్టర్ గిరీష క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంగపేట ముంపు బాధితులకు ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామన్నారు. మంగం పేట గ్రామ పంచాయతీ కాపువల్లి, అరుందతివాడ మరియు హరిజనవాడ గ్రామాలలో గ్రామస్తుల కోరిక మేరకు లేఅవుట్లో అన్ని మౌలిక వసతులు కల్పించి సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ లేఅవుట్‌లో సిసి రోడ్డు, డ్రెయినేజీ, స్కూల్ బిల్డింగ్, ఎలెక్ట్రికల్, ప్లే గ్రౌండ్, శ్మశనవాటికి, పార్క్ తదితర మౌలిక వసతులన్నీ లేఅవుట్‌లో కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని నెల రోజులలో రోడ్డు పనులు పూర్తి చేసి వాటర్ సప్లై ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇక్కడ నిర్మించే ప్రతి ఇంటికి అండర్ గ్రౌండ్ కరెంటు సదుపాయం కల్పిస్తామన్నారు. కాలనీలో విశాలమైన రోడ్లు, రోడ్డు కిరు వైపులా గ్రీనరీ ఏర్పాటు చేసి పచ్చదనాన్ని పెంపొందిస్తామని చెప్పారు. ఆర్చి నిర్మాణం ఆకర్షణీయంగా ఉండాలని పంచాయతీరాజ్ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంగంపేటను స్పెషల్ కేస్ కింద తీసుకోవడం జరిగిందని ఈ కాలనీని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఆర్‌అండ్‌ఆర్ 5 లే అవుట్‌లో ప్రత్యేక వసతులతో కూడిన పార్కు నిర్మాణం చేపడతామన్నారు. కాపువల్లిని ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి సురక్షితమైన ప్రాంతాలకు తరలించడం ప్రతి ఒక్కరూ గమనించదగ్గ విషయమన్నారు. ఈ లేఅవుట్ నిర్మాణానికి సంబంచి ఎటువంటి సమస్యలున్నా వెంటనే తమ దష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం కలెక్టర్ వివిధ అంశాలపై మంగపేట నిర్వాసితులతో సుదీరెంగా చర్చించి అధికారులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ మంగంపేట నిర్వాసితులకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగంపేట నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆర్‌అండ్‌ఆర్ 5 లేఔట్ నిర్మించడం ఎంతో శుభ పరిణామమన్నారు. ఈ అవుట్‌లో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించడం అవుతుందని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పంజం సుకుమార్ రెడ్డి, తహశీల్దార్ పుల్లారెడ్డి, సర్వేయర్, ఎపిఎస్‌పిడిసిఎల్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులుహొ పాల్గొన్నారు.