మంగళగిరి: మంగళగిరిని క్రీడాహబ్ గా తీర్చిదిద్దేందుకు కషి చేస్తు న్నామని, భవిష్యత్తులో మంగళగిరి కేంద్రంగా జాతీయ స్థాయిలో ఈత, స్కేటింగ్ పోటీలను నిర్వహించే విధంగా స్విమ్మింగ్ ఫూల్, స్కేటింగ్ రింక్ నిర్మాణాలను చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి, నగర పాలక సంస్థ అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించి తుదిదశకు చేరుకున్న పలు అభివృద్ధి నిర్మాణాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. తొలుత నగరంలో సుమారు కోటి రూపాయలతో నిర్మిస్తున్న సగర కమ్యూనిటీ హాలు నిర్మాణం పనులను, రూ.3 కోట్ల వ్యయంతో రాజీవ్ గృహకల్ప ఆవరణలో నిర్మించిన చేనేత మగ్గం షెడ్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం రజక కమ్యూనిటీ హాలు నిర్మాణం పనులను పరిశీలించారు. అక్కడి నుంచి పాత బస్టాండ్ ఆవరణలో నిర్మిస్తున్న చేనేత బజారు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కె మాట్లాడుతూ తుది దశకు చేరుకున్న సగర, రజక కమ్యూనిటీ హాల్స్ నిర్మాణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి పదిపదిహేను రోజుల్లో ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచిం చారు. ఇక యాదవ, క్రిస్టియన్, మైనారిటీలకు, ఎరుకుల, యానాదుల కులాల వారి సౌకర్యార్థం కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలకు కూడా స్థల పరిశీలన కూడా పూర్తయినట్లు చెప్పారు. నాయీ బ్రాహ్మణ, బోయ కులాల వారికి కూడా వీలైనంత త్వరలోనే స్థలం పరిశీలన చేసి కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు.
ఈత, స్కేటింగ్ పోటీలకు మంగళగిరి వేదిక కావాలి
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవితో కలసి తుదిదశకు చేరుకున్న స్విమ్మింగ్ ఫూల్, స్కేటింగ్ రింక్ లను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ షంషేర్ మహబూబ్ ఖాన్ పేరుతో స్విమ్మిం గ్ ఫూల్ ను అత్యాధునికంగా, పిల్లలకు బేబీ స్విమ్మింగ్ ఫూల్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో జాతీయ స్థాయి ఈత, స్కేటింగ్ పోటీలకు మంగళగిరి వేదిక కానుందన్నారు. క్రీడాకారులకు మరింత ప్రోత్సాహాన్ని అందించి మంగళగిరిని క్రీడా హబ్‌గా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తు న్నామన్నారు. ఆయా కార్యక్రమాల్లో వైసిపి చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు ఎం.మల్లేశ్వరరావు, నగరపాలక సంస్థ డీఈ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










