ప్రజాశక్తి - పెదనందిపాడు : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల, మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈనెల 14-30 తేదీల్లో పెద్దఎత్తున ప్రచారభేరి నిర్వహిస్తున్నామని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. ఇందులో భాగంగా సోమవారం మంగళగిరిలో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఆదివారం పెదనందిపాడుకు వచ్చిన ఆయన స్థానిక తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రం వద్ద విలేకర్లతో మాట్లాడారు. బిజెపిి పాలనలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగాయని, ప్రజల ఆదాయాలు మాత్రం పెరగలేదని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలైన ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారన్నారని అన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని, ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదని చెప్పారు. రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిగా విరుద్ధంగా కేంద్ర వ్యవహరిస్తోందని, రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగించుకొని ప్రతిపక్ష పార్టీల నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మిక హక్కులను కాలరాస్తున్నారని, వ్యవసాయాన్ని కార్పొరేట్ల పరం చేసేందుకు మూడు వ్యవసాయ చట్టాలను తీసుకురాక రైతులు పోరాడి తిప్పికొట్టారని గుర్తు చేశారు. గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగింపు కోసం అవసరమైన భూసేకరణకు వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విస్తరణ పనులు పూర్తయ్యే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. ప్రచారభేరీలో భాగంగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో మంగళగిరిలోని ఆటోనగర్లో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తామని, సభకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకష్ణ హాజరవుతారని తెలిపారు. ఈనెల 25, 26 తేదీల్లో పెదనందిపాడు, ప్రత్తిపాడు, కాకుమాను మండలాల్లో ఆటో ప్రచార జాతాను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కె.నాగేశ్వరరావు, మండల కార్యదర్శి డి.రమేష్‌బాబు, ప్రజా సంఘాల నాయకులు ఎన్.ఆచారి, బి.శంకరయ్య, ఎల్.వెంకట నాగేశ్వరరావు, సిహెచ్.యానాదులు, జె.రామారావు, ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.










