Jul 22,2021 20:31

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్‌, పారిశుధ్య సిబ్బంది, ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు గురువారం ప్రకటన విడుదల చేశారు. పారిశుధ్య సిబ్బందికి నాలుగు నెలల జీతాల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఇఒలకు, గ్రామ కార్యదర్శులకు పంచాయతీ నిధులు ఖర్చు చేయడానికి చెక్కు పవర్‌ ఉండేదని, ప్రస్తుతం రద్దు చేయడంతో పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటుచేసిన కార్పొరేషన్‌ కూడా జీతాలు చెల్లించడం లేదని తెలిపారు. ఫలితంగా కార్పొరేషన్‌లో కలిసిన 21 గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు గత నాలుగు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదన్నారు. మంగళగిరి మండలంలో పనిచేస్తున్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు, ఇతర సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే మంగళగిరిాతాడేపల్లి కార్పొరేషన్‌ నుంచి విలీన గ్రామాల పారిశుధ్య కార్మికులకు, మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్‌ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.