ప్రజాశక్తి - మండవల్లి
2022-2023 విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలను కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి హిందీ పరీక్షలను గురువారం ఆయన పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నామన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా గాలి వెలుతురు వచ్చే గదులను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతేడాది పదో తరగతి పరీక్షలో చోటు చేసుకున్న మాస్ కాపీయింగ్ దృష్ట్యా ఈ ఏడాది పరీక్షల్లో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. సమస్యాత్మకమైన పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పరీక్ష కేంద్రంలో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఆయనతో పాటు తహశీల్దార్ సతీష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
'పది' పరీక్షలకు 878 మంది హాజరు
కలిదిండి :పదో తరగతి ద్వితీయ భాష హిందీ పరీక్షకు 11 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఎంఇఒ కొల్లాటి నరేష్‌కుమార్ తెలిపారు. మండలంలో ఐదు పరీక్షా కేంద్రాలు ఆరుతెగలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 166కు ముగ్గురు విద్యార్థులు, కోరుకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 248 మందికి ఇద్దరు, కలిదిండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎ సెంటర్‌లో 171కి నలుగురు, బి సెంటర్‌లో 170 మందికి ఒకరు, భాస్కరరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 134 మంది విద్యార్థులకు ఒక విద్యార్థి గైర్హాజరయ్యారన్నారు. మొత్తం 889 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 878 మంది హాజరయ్యారని తెలిపారు.










