
మండుతున్నాయి..
- 25 శాతం పెరిగిన టపాసుల ధరలు
- కొనుగోలుకు సామాన్యుల అనాసక్తి
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి
టపాసుల ధరలు మండుతున్నాయి. గతేడాది కంటే 25 శాతం వరకు ధరలు పెరగడంతో టపాసులను కొనేందుకు సామాన్యులు ఆసక్తి చూపడం లేదు. ధరల పెరుగుదలతో వ్యాపారాలపై ప్రభావం పడే అవకాశం ఉంది వ్యాపారస్తులు అంటున్నారు..
దీపావళి అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది కాకపూల వెలుగులు, టపాసుల ఢాం..ఢాం శబ్దాలు. చాలా మంది అవి లేకుండా దీపావళి పండుగ జరుగదు. దీపావళికి కొనుగోలు చేసే టపాసుల ధరలు ఈ ఏడాది మండుతున్నాయి. గతేడాది కంటే 20 నుంచి 25 శాతం వరకూ ధరలు పెరగడంతో సామాన్యులు టపాసులను కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. మరికొంత మంది తక్కువ మొత్తంలో కొనుగోలుతో సరిపెట్టుకుంటున్నారు. చిన్నారుల కోసం 6 రకాల టపాసులు కొనాలన్నా కనీసం రూ.2వేల వరకూ ఖర్చు చేయాల్సి వస్తోంది. మధ్య రకం స్పార్కిల్స్(కాకరపూలు) గతేడాది రూ.60 నుంచి రూ.70 ఉండగా ప్రస్తుతం రూ.80 నుంచి రూ.90 ఉన్నాయి. చిచ్చుబుడ్డి బాక్స్ గతేడాది రూ.150 ఉండగా రూ.200కు పెరిగింది. పెన్సిళ్లు గతేడాది రూ.120 ఉండగా రూ.170కు పెరిగాయి. తాళ్లు గతేడాది రూ.120 ఉండగా ఈ ఏడాది రూ.150కు పెరిగాయి. 1000 వాలా టపాసులు గతేడాది రూ.350 విక్రయించగా ఈ ఏడాది రూ.450కు విక్రయిస్తున్నారు. రూ.500 వెచ్చిస్తే కనీసం 3 రకాలు కూడా రావడం లేదు. అధిక ధరల వల్ల చాలా దుకాణాల్లో ఫ్యామిలీ ప్యాక్‌లు తేవడమే మానేశారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో టపాసుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 100 స్టాళ్లలో టపాసుల విక్రయాలను ప్రారంభించారు. టపాసుల ధరలు పెరగడంతో వ్యాపారాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
దీపాలకు తగ్గిన గిరాకీ
దీపావళి పేరులోనే ఉండే దీపాలకు గిరాకీ తగ్గింది. అందరూ టపాసుల కొనుగోళ్లకు ప్రాధాన్యతను ఇస్తుండటంతో దీపాలు, మట్టి ప్రమిదల వ్యాపారాలు కొనుగోలుదారులు లేక వెలవెలబోయాయి. గతేడాదితో పోలిస్తే చాలా తక్కువ మొత్తంలో విక్రయాలు జరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో దీపాలు, మట్టి ప్రమిదాలు విక్రయించేందుకు చిరు వ్యాపారస్థులు దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దుకాణాలు పెరగడం, కొనుగోలుదారులు లేకపోవడంతో ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగలేదు. దీంతో ఈ దీపావళికి నష్టాలు మూటగట్టుకోవాల్సిందేనని వ్యాపారులు చెబుతున్నారు.