
చేతులెత్తేసిన అధికారులు
ప్రజాశక్తి - చాట్రాయి
నాకు ప్యాంక్రియాస్ గ్రంథి డామేజ్ అవ్వటం వల్ల జీవితాంతం మందులు వాడవలసి వస్తుందని, ఆ మందులకు నెలకు రూ.8 వేల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని చిన్నంపేట గ్రామానికి చెందిన కొమ్ము ఆనందం స్పందనకు అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా ఆనందం విలేకరులతో మాట్లాడుతూ అనారోగ్య సమస్య వల్ల పనిచేయలేక పోతున్నానని, కుటుంబం గడవటం లేదని, మందులు కూడా కొనుక్కోలేకపోతున్నానని నాకు పెన్షన్, మందులు ఇప్పించాలని ఈనెల 16న కలెక్టరేట్‌లో అర్జీ అందజేసినట్లు తెలిపారు. శుక్రవారం చిన్నంపేట సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ వి.రమేష్ సచివాలయానికి పిలిపించి మీ సమస్య పరిష్కారం అయినందుకు సంతృప్తి చెందుతున్నారా అని అడగారని, నా సమస్య పరిష్కారం కాలేదని, కనీసం మందులు కూడా ఇవ్వటం లేదని, పెన్షన్ కూడా అర్హత లేదని చాట్రాయి మెడికల్ ఆఫీసర్ చెప్పారని తమ గోడును తెలియజేశారు. ఈమేరకు రమేష్ మీరు అసంతృప్తిగా ఉన్నట్లు పై అధికారులకు పంపించాలని ఫింగర్ ప్రింట్ వేయించారని తెలిపారు. నాకు మందులు ఇప్పించి, నా ప్రాణాలు కాపాడాలని ఆనందం వేడుకొంటున్నారు.