
ప్రజాశక్తి - వన్‌టౌన్ : పశ్చిమ నియోజకవర్గం కొత్తపేటలో గల షేక్ రాజా సాహెబ్ హాస్పిటల్‌లో మందులు ఇచ్చే విభాగం దగ్గర పేషెంట్లు మండుటెండలో మందుల కోసం క్యూలైనులో వేచి ఉండాల్సి రావటం బాధాకరమని, వెంటనే ఆ ప్రాంతంలో షెడ్డు నిర్మించి రోగుల ఇబ్బందులను తొలగించాలని 50వ డివిజన్ సిపిఎం కార్పొరేటర్ బోయి సత్యబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం బోయి సత్యబాబు షేక్ రాజా ఆసుపత్రిలోని మందుల విభాగం వద్ద మందుల కోసం ఎండలో క్యూ లైనులో వున్న రోగుల ఇబ్బందులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పశ్చిమంలో కొండ ప్రాంతంలో ఎక్కువ మంది పేదలు నివసిస్తుంటారని, వారంతా పేదలని, వారు ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకుని, మందుల కోసం ఎండలో ఎలా నిలబడతారని అన్నారు. పైన రేకుల షెడ్ కూడా నిర్మించలేదని, ఈ సమస్యపై హాస్పటల్ సూపరింటెండెంట్‌కి, మున్సిపల్ కమిషనర్ పుండ్కర్‌కి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. ఈ విషయమై కౌన్సిల్ సమావేశంలో సిపిఎంగా ప్రతిపాదన చేయడం జరుగిందన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగుల ఇబ్బందులను పరిష్కరించేందుకు వెంటనే షెడ్డు నిర్మాణం చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేపట్టవలసి వస్తుందని సిపిఎం పశ్చిమ నగర కమిటీ కార్యదర్శి కార్పొరేటర్ సత్యబాబు అధికారులకు వివరించారు.