Oct 19,2023 21:09

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌పి ఎం.దీపిక

ప్రజాశక్తి-విజయనగరం :  దీపావళి పండగ వస్తున్న నేపథ్యంలో మందుగుండు విక్రయించే వ్యాపారులు తప్పనిసరిగా పాటించాలని ఎస్‌పి దీపిక తెలిపారు. వారంతా నిబంధనలు పాటించే విధంగా బైండోవరు చేయాలని, అక్రమ మందుగుండు విక్రయ, తయారీదారులపై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని ఎస్‌పి కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడే విధంగా దర్యాప్తు చేయాలని, సాంకేతిక ఆధారాలను, సాక్షాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతిరోజూ విజిబుల్‌ పోలీసింగు చేపట్టాలని సూచించారు. మోటారు వెహికల్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇ-చలానాలు విధించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వైట్‌ కాలర్‌ నేరాలైన చీటింగు, నమ్మకద్రోహం కేసుల్లో దర్యాప్తు క్షుణ్ణంగా చేపట్టాలన్నారు. మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. దొంగతనాలు జరగకుండా రాత్రి పెట్రోలింగు, గస్తీని ముమ్మరం చేయాలని, ఎటిఎం కేంద్రాలను తరచూ తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి పర్యటనలో భద్రత విధులను సమర్థవం తంగా నిర్వహించిన 2వ పట్టణ సిఐ ఎన్‌.హెచ్‌.విజయ ఆనంద్‌, ఎస్‌ఐ షేక్‌ శంకర్‌, రాజాం చోరీ కేసును చేధించిన ఎస్‌ఐ వై.రవికిరణ్‌, అగ్ని ప్రమాదానికి గురైన ప్రయివేటు బస్సులో ప్రయాణికులను సకాలంలో స్పందించి రక్షించిన ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఎ.ఎం.రాజు, హెచ్‌జి సిహెచ్‌.వెంకటరావు, అగ్నివీర్‌ బందోబస్తు నిర్వహించిన ఆర్‌ఎస్‌ఐ ఎ.రామకృష్ణతోపాటు సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందిని ఎస్‌పి దీపిక అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో ఎఎస్పఇ అస్మా ఫర్హీన్‌, ఎస్‌ఇబి ఎఎస్‌పి ఎస్‌.వెంకటరావు, డిఎస్‌పిలు ఆర్‌.గోవిందరావు, పి.శ్రీధర్‌, డి.విశ్వనాథ్‌, న్యాయ సలహాదారు వై.పరశురాం, తదితరులు పాల్గొన్నారు.