Nov 06,2023 21:23

మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

కొమరాడ: అక్రమంగా ఇంట్లో నిల్వ ఉన్న దీపావళి మందు గుండు సామగ్రిని ఎస్సై జగదీష్‌ నాయుడు ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మార్కొండపుట్టిలో అక్రమంగా నిల్వ ఉన్న మందు గుండి సామాగ్రిని పట్టుకున్నట్లు తెలిపారు. గ్రామంలో ఒక ఇంట్లో మందు గుండు సామాగ్రి నిల్వ ఉన్నట్లు సమాచారం రావడంతో హెడ్‌ కానిస్టేబుల్‌ రాజారత్నం ఆధ్వర్యంలో దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో సుమారు రూ.15వేలు విలువచేసే దీపావళి మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న మందుగుండు సామగ్రిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.
ముందుగుండు సామాగ్రి కొనుగోలు చేసినా జాగ్రత్తగా ఉంచాలి
మండలంలోని ప్రజలు దీపావళి పండుగ సందర్భంగా మందు గుండు సామాగ్రి కొనుగోలు చేసినప్పటికీ సురక్షితమైన ప్రదేశాల్లో నిల్వ ఉంచాలని ఎస్సై తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్‌ స్టేషన్లో విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. మందు గుండు సామాగ్రి మండలంలోని ఇటువంటి అనుమతుల్లేకుండా అమ్మకాలు చేసి, నిల్వ ఉంచిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో ఎటువంటి లైసెన్సులు లేకుండా మందు గుండు సామాగ్రి అమ్మకాలు చేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. ఈ దాడుల్లో స్థానిక పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.