ప్రజాశక్తి-వేటపాలెం: రోగులకు వైద్యం అందించి మన్ననలు పొందాల్సిన డాక్టర్, ఇటీవల హెల్త్ అసిస్టెంట్ నుంచి సూపర్‌వైజర్‌గా ప్రమోషన్ పొందిన ఉద్యోగి, కార్యాలయ యుడిసి మొత్తం ముగ్గురు. మండలంలోని బండ్ల ఆదెమ్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఉద్యోగులు. ఎక్కడా చోటు దొరకలేదేమో.. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం మూడు గంటల వరకు హాస్పటల్ కార్యాలయంలో సిట్టింగ్ వేశారు. మందుబాబుల అవతారమెత్తి ఎంచక్కా మద్యం సేవించారు. మద్యం కిక్కు తలకెక్కాక గావుకేకలు వేశారు. ఆ రణగొణ ధ్వనులను గుర్తించిన స్థానికులు నేరుగా వేటపాలెం ఎస్‌ఐ సురేష్‌కు చరవాణి ద్వారా ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ కానిస్టేబుల్స్‌ను పంపారు. పోలీసులు నేరుగా హాస్పటల్‌కు వెళ్లి విచారించి నేరుగా కార్యాలయంలోకి వెళ్లారు. మందుబాబులు పోలీసుల కాళ్లావేళ్లాపడి కార్యాలయం నుంచి బయటపడ్డారు. ఆఫీసు ఎదురుగా ఉన్న చెట్టు నీడలో సేదతీరారు. డాక్టర్ మఫ్టీలో ఉండడాన్ని గమనించి కొందరు నాయకులు ప్రశ్నించారు. మరి కొందరు నాయకులు తమ ఫోన్లలో ఫొటోలు తీసే ప్రయత్నాలు విఫలమయ్యాయి. పోలీసులు జరిగిన సంఘటన గూర్చి సాదారణంగా తీసుకోవడం పట్ల స్థానికులు పెదవి విరిచారు. వేటపాలెం ఎస్‌ఐ సురేష్‌ను ప్రజాశక్తి వివరణ కోరగా తనకు ఫోన్ వచ్చిన మాట వాస్తవమేనని అన్నారు. హాస్పటల్‌లో ఏరియాలో మద్యం సేవిస్తున్న వారి గురించి ఫోన్ రాగానే మా సిబ్బందిని పంపించాను. అక్కడ ఎవరూ లేరని చెప్పారని తెలిపారు. ఈ సంఘటన గూర్చి స్థానిక మండల జడ్‌పిటిసి బండ్ల తిరుమలాదేవి నేరుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. గత మూడు నెలల క్రితం ఉమ్మడి జిల్లా విద్య వైద్య స్టాండింగ్ కమిటీ మెంబర్ బండ్ల తిరుమలాదేవి.. డాక్టర్ ప్రభాకర్‌రావు వలన వైద్యశాలకు వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కమిటీ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు గురించి డిఎంఅండ్‌హెచ్‌ఒ ఇప్పటివరకు కనీస విచారణ చేయకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్య కేంద్రానికి కేటాయించిన డిసిహెచ్ నిధుల్లో కూడా లెక్కకు మించి అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి అక్రమాల గురించి, డాక్టర్ ప్రవర్తన గురించి విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు.










