Nov 15,2023 22:44

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

మందస: మందసను కరువు మండలంగా ప్రకటించాలని ఎపి జీడి రైతు సంఘం తెప్పల అజరుకుమార్‌, రైతు సంఘం నాయకులు మహేంద్ర, చైతన్య. బెస్త కామేశ్వరరావు, మామిడి మాధవరావు ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద బుధవారం నిరసన తెలిపారు. అనంతరం మందసలో పర్యటించిన పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాభావంతో పాటు శాశ్వత నీటి వనరులు లేనందున పంటలు పండడం లేదని అన్నారు. దీంతో రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక వలసలు అధికమవుతున్నాయన్నారు. తొలకరిలో కురిసిన వర్షాలకు వరి నాటు వేశారని అన్నారు. సెప్టెంబరు నెలలో పంపు సెట్లు, ఇంజిన్లతో ఎకరా సేద్యానికి రూ.25 వేలు నుంచి రూ.30 వేలు పెట్టుబడి పెట్టి వరినాట్లు వేశారని అన్నాయి. నీరు చాలక, వర్షాలు లేక పగుళ్లు ఏర్పడి పంట పూర్తిగా ఎండిపోయని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇన్స్యూరెన్స్‌, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, రబీ సీజన్‌కు పెసలు, మినుములు, నువ్వులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, చిరుధాన్యాల విత్తనాలు ఉచితంగా అందజేయాలని కోరారు. జీడీ, కొబ్బరి బోర్డులు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. నక్కసాయి, జంతి బంద, సంకుజోడు, గోపాల సాగర్‌లను రిజర్వాయర్లుగా నిర్మించి సాగునీరు అందించాలన్నారు. జెన్నా చెరువు, కొత్తచెరువు, ఈతచెరువు, జంపరగాయి, బెల్లు పటియా ధోని, కళింగ దళ్‌, డబారుసింగి గ్రోయన్లు, మధుములు, గైరిలలో పూడికలు, ఆక్రమణలు తొలగించి మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ముకుందపురం, పింపిలి, మహేంద్ర తనయ పరిసర గ్రామాల రైతులకు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలని కోరారు. గిరిజన రైతులకు, పొందర కులాలు కాయగూరలు పండించే రైతులకు సామూహిక వ్యవసాయ బోరు బావులు ఉచితంగా ఏర్పాటు చేసి సాగునీరు అందించాలన్నారు. కరువు మండలంగా ప్రకటించి ఎకరాకు రూ.20 వేలు చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కొర్ల హేమారావు చౌదరి, మజ్జి బాబూరావు, దాసరి తాతారావు, ఎం.హడ్డి, సోమనాథం, కంసు కృష్ణమూర్తి, తామడ త్రిలోచనా, శ్రీరాములు, ముకుందరావు పాల్గొన్నారు.