Nov 06,2023 00:00

మండపేట మెయిన్‌ రోడ్డులో వాహనాలతో నిలిచిపోయిన ట్రాఫిక్‌

ప్రజాశక్తి - మండపేట
పెరుగుతున్న జనాభాతో పాటు రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న మండపేట పట్టణాన్ని ట్రాఫిక్‌ సమస్య వేధిస్తోంది. ప్రతి రోజూ ట్రాఫిక్‌లో చిక్కుకుని ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. పట్టించుకోవాల్సిన పాలకులు, అధికారులు ఉదాసీనంగా వ్యహరిస్తుండటంతో రోజురోజుకూ ఈ సమస్య పెరిగిపోతోంది. సుమారు 25 గ్రామాల నుంచి ప్రజలు ప్రతిరోజూ ఏదొక పనిపై పట్టణానికి రాకపోకలు సాగిస్తుంటారు. వాహనాలు, ప్రజల రాకపోకలతో ప్రధాన కూడళ్లు ట్రాఫిక్‌ చక్రబంధనంలో చిక్కుకుంటున్నాయి.
పట్టణంలోనూ భారీ వాహనాల రాకపోకలు
నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలు సైతం పట్టణంలోనే రాకపోకలు సాగిస్తున్నాయి. రెండు కిలోమీటర్ల మేర ఉన్న మండపేట బైపాస్‌ రోడ్డు మీదుగా వెళ్లాల్సిన భారీ వాహనాలు, లారీలు, ట్రాక్టర్లు పట్టణ నడిబొడ్డులోని ప్రధాన రహదారి మీదుగా వెళ్లడంతో తరచూ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. భారీ వాహనాల కొట్టే హరన్లతో శబ్ధకాలుష్యంతో ఆసుపత్రులలోని రోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అంతేకాకుండా స్థానిక కపిలేశ్వరపురం రోడ్డుమీదికి వ్యాపారాలు విస్తరిస్తుండంతో అటు పాదచారులు ఇటు ద్విచక్రవాహనదారులకు తిప్పలు తప్పడంలేదు. దీంతో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.50 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఇందిరాగాంధీ బైపాస్‌ రోడ్డు నిరూపయోగంగా మారిందని ప్రజలు అంటున్నారు.
ఇఓషవల కాలంలో భారీ వాహనాల డ్రైవర్లతో పాటు ట్రాక్టర్లు, లారీలు, ద్విచక్రవాహనదారులు ఎక్కువగా సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడుతున్నారు. అంతేకాకుండా మోటర్‌సైకిల్‌పై కొన్ని సమయాల్లో ముగ్గురు మరికొన్ని సమయాల్లో నలుగురు యువకులు వెళుతుండటం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది. దాని కోసం పోలీసులు చర్యలు చేపడతున్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యం..
తరచు ట్రాఫిక్‌కు అంతరాయం
సుమారు 60 వేల జనాభా ఉన్న మండపేట పట్టణంలో ప్రధాన కూడళ్ల ట్రాఫిక్‌ ఐలాండ్స్‌ అభివృద్థి చేయాలని గతంలో కౌన్సిల్‌ తీర్మానం చేసినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. పెరుగుతున్న ట్రాఫిక్‌ పట్టణ పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. ప్రధానంగా కలువపువ్వు సెంటర్‌, కరాచి, రాజారత్న, ఆదిత్య కాలేజ్‌, మారేడుబాక వంతెన తదితర జంక్షన్ల వద్ద నిత్యం ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుంది. ఈ ప్రాంతాల్లో తప్పనిసరిగా ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టాల్సి ఉంది. ఉదయం, సాయంత్రం రద్దీగా ఉండే కూడళ్లలోనైనా సిగల్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు. లోడింగ్‌ అన్‌ లోడింగ్‌ సమయపాలన లేకపోవడం గంటలకొద్దీ ట్రాఫిక్‌ నిలిచిపోతుందని స్థానికులు అంటున్నారు. దీంతోపాటు ఇరుకు మార్గంగా ఉన్న స్థానిక సత్యశ్రీ రోడ్డును విస్తరించాలని పలువురు కోరుచున్నారు. ఈ విషయంపై పట్టణ ఎస్‌.ఐ అశోక్‌ను వివరణ కోరగా పట్టణ పరిధిలోని ట్రాఫిక్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. అనుమతి లేకుండా పట్టణంలో నుంచి వెళుతున్న వాహనాలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ట్రాఫిక్‌ నియంత్రణపై పర్యవేక్షణ కరువు
మండపేట పట్టణంలో ట్రాఫిక్‌ నియంత్రణపై పర్యవేక్షణ కొరవ డింది. ఏడిద జంక్షన్‌, రాజరత్న బైపాస్‌ రోడ్డులలో వెళ్లాల్సిన భారీ వాహనాలు,లారీలు, ట్రాక్టర్లు పట్ట ణంలోని కపిలేశ్వరపురం రోడ్డు, మెయిన్‌ రోడ్డులోని బస్టాండ్‌ మీదుగా వెళుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిక్కిరిసిపోతున్న జంక్షన్‌లలో భారీ వాహనాలు మోగించే హరన్‌లతో స్థానిక ప్రజలతోపాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రుల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి.
- కె.కృష్ణవేణి, సిఐటియు జిల్లా కార్యదర్శి, మండపేట