Oct 06,2023 23:37

ప్రజాశక్తి-అమలాపురం
మండపేట - ద్వారపూడి రోడ్డు నిర్మాణ పనులు తక్షణం పూర్తి చేయాలని పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండపేట - ద్వారపూడి మధ్య ఎనిమిది కి,.మీ రోడ్డు నాలుగున్నర సంవత్సరాల నుంచి నిర్మాణం చేయలేదన్నారు. ఈ రోడ్డు గోతులతో ప్రమాదాలకు నిలయమైందన్నారు. ఈ రోడ్డు ద్వారపూడి, రాజమండ్రి, సామర్లకోట కనెక్టివిటీ రోడ్డుగా ఉందన్నారు .పెద్ద పారిశ్రామిక ప్రాంతంగా ఉందనీ 150 రైసు మిల్లులు, ఎడిబుల్‌ ఫ్యాక్టరీలు, పేపర్‌ మిల్లు ఉన్నాయనీ రోజుకు 500 లారీలు తిరుగుతూ ఉంటాయన్నారు. ప్రజలు ఉద్యోగులతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు నిత్యం ప్రయాణాలు చేస్తారన్నారు. ఈ నాలుగున్నర ఏళ్లలో 200 పైగా ప్రమాదాలు జరిగాయని 8 మంది చనిపోయారని తెలిపారు. ఎందరో గాయాల పాలయ్యారనీ రోడ్డు బాగు చేయించాలని ఎంతోమందికి మొరపెట్టుకున్న పని కాకపోవడంతో రాష్ట్రపతి వరకు రోడ్డు దుస్థితి సమస్య వెళ్ళిందన్నారు. రాష్ట్రపతి ఆదేశంతో రూ.25 కోట్లు మంజూరు అయినప్పటికీ నిర్మాణం పనులు పూర్తి కాలేద రన్నారు. మండపేట - ద్వారపూడి రోడ్డు నిర్మాణ పనులు తక్షణం పూర్తి చేయాలని పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు విజ్ఞప్తి చేస్తున్నామని ఎంఎల్‌సిఐవి అన్నారు. గత నెల సెప్టెంబర్‌ 27న శాసనమండలిలో రాష్ట్ర రహదారులపై చర్చించేందుకు పిడిఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ కెఎస్‌.లక్ష్మణరావు, పిడిఎఫ్‌ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జి, తాను ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని శాసనమండలి చైర్మన్‌ అనుమతిని తిరస్కరించారన్నారు. ఈ సందర్భంగా కెఎస్‌.లక్ష్మణరావు మండపేట- ద్వారపూడి రోడ్డు గురించి హౌస్‌ కి తెలియజేశారని, ఛైర్మన్‌ దీనిపై చర్చకు అనుమతించలేదన్నారు.