19కి చేరిన పాజిటివ్ కేసులు
ప్రజాశక్తి-రాజవొమ్మంగి
మండలంలోని కోవిడ్ మహమ్మారి మరో సారి విజృంభిస్తుంది. గత మూడు రోజుల్లో మండలంలో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం రాజవొమ్మంగి పిహెచ్‌సి పరిధిలో 11 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ కాగా, జడ్డంగి పీహెచ్సీ పరిధిలో నలుగురికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి, లాగరాయి పిహెచ్‌సి పరిధిలో 8 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్ ఉన్నట్లు తేలిందని ఆయా పీహెచ్‌సీల వైద్యాధికారులు లిఖిత, సేవాసుజి, రవీంద్ర తెలిపారు. రోజురోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మండలవాసులు భయాందోళన చెందుతున్నారు. వాతావరణంలో మార్పుల నేపథ్యంలో ఇప్పటికే ఆయా పీహెచ్‌సిల పరిధిలో జ్వరం, దగ్గు, రొంప, ఒళ్ళు నొప్పులు వంటి రుగ్మతలతో బాధపడుతూ పీహెచ్సీలకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు వినియోగించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు, కోవిడ్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయా పీహెచ్‌సీల వైద్యాధికారులు సూచించారు.










