Mar 11,2023 23:38

రోలుగుంటలో ప్రచారం

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌, రణస్థలం
తనను గెలిపిస్తే శాసన మండలిలో ఉత్తరాంధ్ర ప్రజల వాణిని వినిపిస్తానని పిడిఎఫ్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభ అన్నారు. శనివారం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(రిమ్స్‌), వైద్య కళాశాల, రణస్థలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు విద్య, వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బాగా వెనుకబడ్డ ఉత్తరాంధ్ర జిల్లాల్లో సరైన వైద్య సదుపాయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. శ్రీకాకుళం రిమ్స్‌ వైద్య కళాశాల ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా బాలారిష్టాలు వీడలేదన్నారు. భవనాలు నిర్మించినా మెడికల్‌ కళాశాల, ప్రజా వైద్యశాలలో పని చేసేందుకు సరిపడ వైద్యులు, ఇతర సిబ్బంది లేరన్నారు. కాంట్రాక్టు సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతోందన్నారు. వీరిని రెగ్యులర్‌ చేయాల్సిన ప్రభుత్వం ఏళ్ల తరబడి వెట్టి చాకిరి చేయిస్తోందని విమర్శించారు. జిల్లా నుంచి స్పీకర్‌, ఇతర శాఖల మంత్రులు ఉన్నా జిల్లాలో అభివృద్ధి కాదు కదా, మరింత వెనుకబాటుకు నెట్టబడుతోందని అన్నారు. 194 కిలోమీటర్ల సుదూర తీర ప్రాంతం కాలుష్యం బారిన పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్యాకేజీ, రైల్వేజోన్‌, మెట్రో రైల్‌ వంటి అంశాల్లో రాష్ట్రానికి కేంద్రం ద్రోహం చేసిందని అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టిందని చెప్పారు. దీన్ని ప్రశ్నించాల్సిన అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆ పని చేయడం లేదని అన్నారు. ద్రోహం చేసిన కేంద్ర ప్రభుత్వంతో దోస్తీ చేస్తున్నాయని చెప్పారు. ప్రజా సమస్యలపై మండలిలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు మాత్రమే నిలదీస్తున్నారని అన్నారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీల బలం మండలిలో ఎంత పెరిగితే పట్టభద్రులు, వివిధ తరగతుల వాణిని వినిపించే అవకాశం ఉంటుందని చెప్పారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఐద్వా నాయకులు లక్ష్మి. పాణిగ్రాహి, ఆర్‌.సురేష్‌బాబు, తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్‌ ఉద్యోగ, కార్మికుల మద్దతు
కలెక్టరేట్‌ : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభకు జివిఎంసి ఎంప్లాయీస్‌ యూనియన్‌, కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌లు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించాయని యూనియన్‌ ప్రధాన కార్యదర్శి పి. వెంకటరెడ్డి తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద డాక్టర్‌ రమాప్రభకు మద్దతు తెలుపుతూ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్‌తో సహా దేశాన్ని అమ్మేస్తున్న బిజెపి, గంగవరం, కృష్ణపట్నం పోర్టులను అదానికి అమ్మేసిన వైసిపి ఒట్లు అడిగే హక్కును కోల్పోయాయన్నారు. చట్టసభలలో కార్మికులు, ఉద్యోగులు, ప్రజల గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. క్లాప్‌ డ్రైవర్స్‌, నీటి సరఫరా కార్మిక నాయకులు కుమార్‌, సురేష్‌, అశోక్‌, రవి, రాంబాబు, చిన్నబాబు, ఈశ్వరరావు, గౌతమ్‌ పాల్గొన్నారు.
సిఐటియు ప్లకార్డుల ప్రదర్శన
కలెక్టరేట్‌ : డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ విజయాన్ని కాంక్షిస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద సిఐటియు ఆధ్వర్యాన ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర ఉపాధ్యక్షుడు వై.రాజు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర సమస్యలు, ముఖ్యంగా ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై పోరాడగలిగే డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభకు మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని కోరారు. సిఐటియు నగర నాయకులు జి.అప్పలరాజు, ఎం.సుబ్బారావు, కె.చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
ములగాడ: స్థానికులకు ఉపాధి, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకు పాటుపడతానని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పిడిఎఫ్‌ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ హామీనిచ్చారు. శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హెచ్‌పిసిఎల్‌ మెయిన్‌ గేటు వద్ద ఉద్యోగులు, కార్మికులు, పట్టభద్రుల ఓటర్లను స్వయంగా కలిసి, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ హెచ్‌పిసిఎల్‌, ఐఒసి, బిపిసిఎల్‌, ఇతర ఆయిల్‌ పరిశ్రమలతోపాటు షిప్‌యార్డు, స్టీల్‌ప్లాంట్‌, ఎల్‌ఐసి, బ్యాంకులు, రైల్వేలు, ఇతర ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకు కృషిచేస్తానన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీ పోస్టుల భర్తీ, కార్మికులు, ఉద్యోగులకు సకాలంలో పిఆర్‌సి అమలు, వంటి సమస్యలపై దృష్టి పెడతానన్నారు. హెచ్‌పిసిఎల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) అధ్యక్షుడు వెంకటకృష్ణ, ప్రధానకార్యదర్శి కెఎన్‌ సత్యనారాయణ, ప్రభాకర్‌, ఎన్‌. రాజేష్‌నాయుడు, హరికృష్ణ నాగచైతన్య, పబ్లిక్‌ కోఆర్డినేషన్‌ కన్వీనర్‌ ఎస్‌.జ్యోతీశ్వరరావు సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, మల్కాపురం జోన్‌ అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.పెంటారావు, ఆర్‌.లక్ష్మణమూరి,్త జోన్‌ నేతలు పి.పైడిరాజు, వి.బాబూరావు, వాసు, ఎం.కృష్ణారావు, వై.గంగాధర్‌, ఏసుబాబు శ్రీను, సుభానీ పాల్గొన్నారు.
ఆరిలోవ: ఉత్తరాంధ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోటీచేస్తున్న డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రజా సంఘాల నేతలు కోరారు. శనివారం సిఐటియు, ఐద్వా, పెన్షనర్ల అసోసియేషన్‌, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆరిలోవ, టిఐసి పాయింట్‌ వద్ద గోడపత్రికలను ప్రదర్శిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ మాట్లాడుతూ అధికార పక్షమో, విపక్షమో కాకుండా ప్రజల పక్షాననిలబడే అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరారు. కార్యక్రమంలో వి.నరేంద్రకుమార్‌, పి.శంకరరావు, ఎస్‌. రంగమ్మ, వి.కృష్ణమూర్తి, వి.కాంతం, ఐసిహెచ్‌.నాయుడు, కె.మోహనరావు, రత్నం, ఎ.రమణ, కె.సత్యనారాయణ పాల్గొన్నారు.
సింహాచలం: పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ విజయాన్ని కాంక్షిస్తూ సింహాచల పరిసర ప్రాంతాల్లో సిపిఎం, సిఐటియు సభ్యులు విస్తృతంగాప్రచారాన్ని చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, బ్యాంకుల వద్దకు వెళ్లి పట్టభద్రుల ఓటర్లను కలిసి రమాప్రభను గెలిపించాలని కోరారు.
షిప్‌యార్డు ఉద్యోగ, కార్మిక సంఘాల మద్దతు
ములగాడ: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యమ, ప్రజాసంఘాలు బలపరిచిన పిడిఎఫ్‌ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభకు తమసంపూర్ణ మద్దతు ఉంటుందని షిప్‌యార్డు ఉద్యోగ, కార్మిక సంఘాలు స్పష్టంచేశారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ, ప్రజాకార్మిక విధానాలపై శాననమండలిలోనూ, బయట ప్రశ్నించి పోరాడ గల సత్తా పిడిఎఫ్‌అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభకు మాత్రమే ఉందని తామంతా సంపూర్ణంగా విశ్వసిస్తూ మద్దతు ప్రకటిస్తున్నామని షిప్‌యార్డు సిఐటియు, ఎఐటియుసి, టిఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్‌ ఇతర యూనియన్ల నేతలు వెల్లడించారు. సిఐటియు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బిఎస్‌ఎన్‌.రాజు, ఎస్‌.ప్రసాద్‌, ఎఐటియుసి అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు గోవింద్‌, బి.హరినాధ్‌ టియన్‌టియుసి జనరల్‌ సెక్రటరీ రాజా రమేష్‌ , గున్నయ్య, హెచ్‌ఎంఎస్‌ జనరల్‌ సెక్రటరీ కె.బాబురావు, కెకె.గోవిందరాజు, డి.మధు సూదనరావు,జి.సత్యనారాయణ ఉన్నారు.
సింహాచలంలో వెలసిన ప్రచార బ్యానర్లు
సింహాచలం: పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరుతూ సింహాచలం ప్రధాన కూడలిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. ప్రజా సమస్యలపై నినదించే సత్తా ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థి రమాప్రభ విజయంతో పంచగ్రామాల భూసమస్యకు పరిష్కారం లభిస్తుందని బ్యానర్లలో పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులు, కార్మికుల సమస్యలపైనా, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ, విభజన హామీల అమలుకు రమాప్రభ గెలుపు అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు.
కొత్తకోట:పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరుతూ రావికమతం మండలం దొండపూడి, కొమిరి, కవ్వగుంట తదితర గ్రామాల్లో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అనేక సమస్యలు తాండవిస్తున్నాయని, రమాప్రభను గెలిపిస్తే వీటి పరిష్కారానికి కృషి చేస్తారని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు, సిపిఐ మండల కార్యదర్శి జోగిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘం నేత ఎర్రయ్య, పాడి అప్పారావు, బూరిగ నూకరత్నం, సొలం వరలక్ష్మి పాల్గొన్నారు.
రోలుగుంట:వివిధ సమస్యల పరిష్కారానికి పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభను గెలిపించాలంటూ శనివారం రోలుగుంటలో ప్రజా సంఘాల నేతలు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 13న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావేత్త రమాఫ్రభను గెలిపించాలని కోరారు. జిల్లాల్లో అనేక సమస్యలు తాండవిస్తున్నాయని, రమాప్రభను గెలిపిస్తే అవన్నీ పరిష్కారమవుతాయని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు తెలిపారు. కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి, మడ్డు శ్రీరామ్మూర్తి, ప్రజాశక్తి భాద్యులు శంకరరావు, ఏపీ గిరిజన సంఘం నేత ఎర్రయ్య, పాడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని బిబి.పట్నం, రాజన్నపేట గ్రామాల్లో పిడిఎఫ్‌ అభ్యర్ది డాక్టర్‌ రమాప్రభను గెలిపించాలని శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్మిక, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేస్తున్న పిడిఎఫ్‌ అభ్యర్థి రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సిపిఎం నాయకులు ఈరెల్లి చిరంజీవి కోరారు. ఈ కార్యక్రమంలో మడ్డు శ్రీరామ్మూర్తి, మాజీ ఎంపిటిసి పోతురాజు, రామారావు తదితరులు పాల్గొన్నారు.
సబ్బవరం:ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్‌ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని మండలంలోని వాడవాడలా ప్రజా సంఘాల నేతలు ప్రచారం నిర్వహించారు. మండలంలోని సబ్బవరం సాయి నగర్‌ కాలనీ, ప్రైవేట్‌ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఉపాధ్యాయులతో జరిగిన ప్రచారంలో రాష్ట్ర ఐద్వా అధ్యక్షురాలు బి. ప్రభావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యలపై శాసన మండలిలో పోరాడే అభ్యర్థిని కోరెడ్ల రమాప్రభను ప్రజాసంఘాలు బలపర్చాయని, ఆ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు జక్కాన సత్యనారాయణ, జక్కాన రాము, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పాడ సత్యవతి, సీఐటీయూ నాయకులు మొల్లేటి గౌరీశ్వర రావు, ఎర్ర సోంబాబు తదితరులు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : కోరెడ్ల రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సోమ నాయుడు పట్టభద్రులను కోరారు. అచ్చుతాపురంలో ప్రైవేటు పాఠశాలలు, గ్రంథాలయంలో శనివారం ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కె తిరుపతిరావు, ఆర్‌ రాము, జాగర్పు నర్సింగరావు, రాజాన జగదీష్‌, బి రామ్‌ కుమార్‌, బత్తిన రవిశంకర్‌, బి రంగారావు, సిహెచ్‌ తాతయ్య తదితరులు పాల్గొన్నారు.
సీలేరు : డాక్టర్‌ రమాప్రభకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని యుటిఎఫ్‌ అధ్యక్షుడు దిల్సన్‌ బాబు, గాలకొండ ఎంపీటీసీ అంపరంగి బుజ్జిబాబు, సిఐటియు మండల కార్యదర్శి గడుతూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం జీకే వీధి మండలం రేంతాడలో ప్రచారం చేశారు. ఆర్‌వి నగర్‌, జీకే వీధిలో పట్టభద్రులను కలిసి రమాప్రభకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.