16న ఎంఎల్‌సి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
రెండు స్థానిక సంస్థల స్థానాలకు పెద్దసంఖ్యలో ఆశావహులు
పార్టీలో తొలి నాయకులకు గుర్తింపు దక్కేనా
రేసులో కారుమంచి రమేష్, దిరిశాల కృష్ణ శ్రీనివాస్
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
ఎంఎల్‌సి ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 16న వెలువడనుండటంతో పదవి కోసం ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థలకు సంబంధించి రెండు ఎంఎల్‌సి స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఈ పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఎంఎల్‌సి పదవి కోసం ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టనష్టాలు భరిస్తూ ముందుకు సాగుతున్న తొలి నాయకులను గుర్తించి పదవులిస్తారా.. లేక రాజకీయ కోణంలో ఆలోచించి పదవులు ఇస్తారా అనే చర్చ సైతం వైసిపిలో నడుస్తోంది. పదవులు ఆశిస్తున్న వారంతా వైసిపిలో కీలక నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, వైవి.సుబ్బారెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రితోపాటు జిల్లాలోని మంత్రులను కలుస్తూ తమకు అవకాశం ఇప్పించాలని కోరుతున్నారు. నామినేషన్లకు చివరి తేదీ ఈ నెల 23వ తేదీ కావడంతో మరో వారం రోజుల్లో ఎంఎల్‌సి అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. జిల్లాలోని రెండు ఎంఎల్‌సి స్థానాలు అధికార పార్టీకే దక్కనుండటంతో అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులకు పదవి ఖాయమని చెప్పొచ్చు. దీంతో ఆశావహులంతా ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాను పరిగణనలోకి తీసుకుని ఈ పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆశావహులు జాబితాలో భీమవరానికి చెందిన గూడూరి ఉమాబాల, గుబ్బల తమ్మయ్య, మేకా శేషుబాబు, పాతపాటి సర్రాజు, వంకా రవీంద్ర, చీర్ల రాధయ్య, గుణ్ణం నాగబాబు, బండి అబ్బులు, యడ్ల తాతాజీ వంటి అనేక మంది నాయకులు ఉన్నారు. అయితే వీరిలో చాలామంది వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన ఛైర్మన్ పదవుల్లో ఉన్నారు. ఎన్నికలు జరుగుతున్న రెండు ఎంఎల్‌సి పదవులను గతంలో బిసికి ఒకటి, జనరల్‌కు ఒకటి కేటాయించారు. ఈసారీ అదే తరహాలో కేటాయిస్తారా.. లేక మార్పులు చేస్తారా అనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే డెల్టాలో శాసనమండలి ఛైర్మన్‌గా మోషేన్‌రాజు, ప్రభుత్వ విప్‌గా ముదునూరి ప్రసాద్‌రాజు, ఉప ముఖ్యమంత్రిగా కొట్టు సత్యనారాయణ, మంత్రిగా కారుమూరి నాగేశ్వరరావు ఉండగా డిసిఎంఎస్, డిసిసిబి, జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులన్నీ అటువైపు నాయకులనే వరించాయి. ఈసారి ఈ రెండు ఎంఎల్‌సి పదవులు మెట్ట ప్రాంతానికి ఇవ్వాలని ఇక్కడి నాయకులు పట్టుబడుతుండగా, డెల్టాకు ఒకటి, మెట్ట ప్రాంతానికి ఒకటి ఇవ్వాలనే వాదన సైతం నడుస్తోంది. దీంతో అధిష్టానం ఏనిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.
'కారుమంచి'ని గుర్తిస్తారా..?
గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లకు చెందిన కారుమంచి రమేష్‌ను ఈసారైనా వైసిపి అధిష్టానం గుర్తించి ఎంఎల్‌సి పదవి కట్టబెడుతుందా అనే చర్చ నడుస్తోంది. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి కారుమంచి రమేష్ కాంగ్రెస్‌ను వీడి వైసిపిని అంటిపెట్టుకునే ఉన్నారు. నల్లజర్ల మండలం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నప్పటికీ రమేష్ మాత్రం వైసిపిని వీడకుండా ఆదినుంచి క్రియాశీలంగా ఉంటూ వచ్చారు. తన సామాజిక తరగతి అంతా టిడిపిలో ఉన్నప్పటికీ రమేష్ మాత్రం వెనక్కు తగ్గలేదు. టిడిపి ప్రభుత్వ హాయాంలో స్థానిక టిడిపి నాయకులు తీవ్ర ఇబ్బందులకు గురిచేసి ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెట్టినా జంకకుండా పంచాయతీ, ఎంపిటిసి ఎన్నికల్లో కీలకపాత్ర పోషించి వైసిపి అభ్యర్థులచే విజయబావుటా ఎగురవేయించారు. అయితే రమేష్‌కు తగిన గుర్తింపు లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. స్థానిక ప్రాధాన్యత ఉన్న పిఎసిఎస్ ఛైర్మన్ పదవి మాత్రమే ఇచ్చారు. జిల్లాలో రెండు ఎంఎల్‌సి స్థానాలకు షెడ్యూల్ విడుదల కావడంతో కారుమంచి రమేష్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆది నుంచి పార్టీ కోసం కష్టపడిన రమేష్‌ను ఇప్పటికైనా గుర్తిస్తారా లేదా అనే చర్చ సర్వత్రా సాగుతోంది. కమ్మ సామాజిక తరగతికి చెందిన రమేష్‌కు ఈ పదవి ఇస్తే నియోజకవర్గంలో కూడా పార్టీకి మరింత మేలు జరిగే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. రమేష్ సైతం తన ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
రేసులో దిరిశాల కృష్ణ శ్రీనివాస్
తణుకు నియోజకవర్గం అత్తిలికి చెందిన దిరిశాల కృష్ణ శ్రీనివాస్ సైతం ఎంఎల్‌సి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీనివాస్ కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారే. గత ఎన్నికల్లో తణుకు ఎంఎల్‌ఎ టిక్కెట్ సైతం ఆశించారు. ఉంగుటూరు నియోజకవర్గం ఎన్నికల పరిశీలకునిగా, ఎన్నికల సమయంలో ఉండి నియోజకవర్గంలోనూ పని చేశారు. వైసిపి ఎన్‌ఆర్‌ఐ విభాగంలో కీలకంగా ఉన్నారు. కాపుల కోటాలో శ్రీనివాస్ పదవి ఆశిస్తున్నారు. ఎంఎల్‌సి ఆశావహుల జాబితాలో శ్రీనివాస్ పేరు కూడా ప్రముఖంగా విన్పిస్తోంది.










