Mar 11,2023 23:29

ఏర్పాట్లను పరిశీలిస్తున్న సంయుక్త కలెక్టర్‌ శివశ్రీనివాస్‌

ప్రజాశక్తి-పాడేరుటౌన్‌: ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. ఈనెల 13న జరగనున్న ఎన్నికలకు దాదాపు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటలల్లోపు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇంటింటికి ఓటరు స్లిప్పులను అందిస్తున్నారు. ఎన్నికల సిబ్బంది కోసం 7 ఆర్‌టిసి బస్సులు సిద్ధం చేశారు. సార్వత్రిక ఎన్నికల మాదిరిగా కాకుండా ఈ ఎన్నికలకు బ్యాలెట్‌ పత్రాలను వినియోగిస్తారు. ఆ మేరకు అధికారులు ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి పాడేరు డివిజన్‌ 11 మండలాల్లో 11,525 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 7861 మంది, మహిళలు 3661 మంది, ఇతరులు ముగ్గురు ఓటర్లు ఉన్నారు. అందుకుగాను 15 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయనున్నారు. పాడేరు డివిజన్‌కు గాను తలారిసింగి జిటిడబ్ల్యూ ఆశ్రమ పాఠశాలలో (బాలురు) డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విశాఖ స్వర్ణభారతి ఓట్ల లెక్కింపు కేంద్రంలో తరలించేంత వరకు తలారిసింగి జిటిడబ్ల్యూ ఆశ్రమ పాఠశాలలోనే (బాలురు) కట్టుదిట్టమైన భద్రతతో తాత్కాలిక స్ట్రాంగ్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. మొత్తం 5 జోన్లు, 5 రూట్లను ఏర్పాటు చేశారు. ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలక్రిష్ణ, జెసి శివ శ్రీనివాసు, సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌, రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సాల్‌, డ్వామా పిడి రమేష్‌ రామన్‌, డిఆర్‌ డిఎ పిడి వి.మురళిలను ఆయా జోన్‌/రూట్‌ లకు ప్రత్యేక అధికారులుగా నియమించారు. డిఇఒ, ఉద్యానవన ఎపిడి పవన్‌ కుమార్‌, జిల్లా కోపరేటివ్‌ అధికారి ఎంవి.కృష్ణంరాజు, చింతపల్లి డ్వామా ఎపిడి ఎల్‌.రామారావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బిఎస్‌ నంద్‌లను జోన్‌ల అధికారులుగా, అనంతగిరి ఆర్‌ డబ్ల్యూఎస్‌ డిఇఇ ఎం.జయరాం, పెదబయలుకు ఆర్‌ డబ్ల్యూఎస్‌ డిఇఇ డి.గోపాలక్రిష్ణ మూర్తి, చింతపల్లి ఆర్‌ డబ్ల్యూఎస్‌ డిఇఇ జిఆర్‌.రాజు, చింతపల్లి టిడబ్ల్యూ డిఇఇ చాణుక్యలను రూట్‌ అధికారులుగా నియమించారు. పిఒలు, ఎపిఒలు, ఒపిఒలు, సూక్ష్మ పరిశీలకులను నియమించారు. పోలింగ్‌ రోజున ఎలాంటి వాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించేందుకు పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు.
ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఈ నెల 13న జరగనున్న ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని సంయుక్త కలక్టర్‌ జే.శివ శ్రీనివాసు తెలిపారు. శనివారం తలారిసింగి ప్రభుత్వ గిరిజిన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌, రిసేప్సన్‌ కేంద్రాన్ని జేసి సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ, ఎన్నికలు సజావుగా నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇప్పటికే బ్యాలెట్‌ బాక్షులు, బ్యాలెట్‌ పేపర్లతో పాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఇతర సామగ్రి జిల్లాకు చేరుకుందని తెలిపారు.ఆదివారం ఉదయం నుండి తలారిసింగి పాఠశాల నుండి ఆయా పోలింగ్‌ కేంద్రాలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకే పోలింగ్‌ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రానికి చేరుకుంటారని, వీరికి పోలింగ్‌ కేంద్రం వారీగా ఎన్నికల సామగ్రి అందజేసి సంబంధిత రూట్‌ అధికారులు కేంద్రాలకు కేటాయించిన వాహనాలలో చేరవేస్తారని జేసి వివరించారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి నలుగురు పోలింగ్‌ అధికారులు చొప్పున (ఒక పోలింగ్‌ అధికారి, ఒక సహాయ పోలింగ్‌ అధికారి, ఇద్దరు ఇతర పోలింగ్‌ అధికారులు) విధులు కేటాయించటం జరిగిందన్నారు. రిజర్వ్‌తో సహా 36 మంది పోలింగ్‌ అధికారులు, 36 మంది సహాయ పోలింగ్‌ అధికారులు, 72 మంది ఇతర పోలింగ్‌ అధికారులను కేటాయించటం జరిగిందన్నారు. 18 మంది మైక్రో అబ్జర్వర్లు, వెబ్‌ కేస్టింగ్‌ కు 15 మంది వీడియోగ్రాఫర్లను నియమించటం జరిగిందన్నారు.