ప్రజాశక్తి-యంత్రాంగం
అల్లూరి జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో సోమవారం ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 11 మండలాల్లోని ఏర్పాటు చేసిన 15 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి పట్టభద్రుల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగక పోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
పాడేరు: పాడేరులో పోలింగ్ ఉదయం మందకొడి గానే పోలింగ్ సాగింది. మధ్యాహ్నం 12గంటల సమయానికి పోలింగ్ కేవలం 20.80శాతం మాత్రమే జరిగింది. ఆ తర్వాత పలుచోట్ల మధ్యాహ్నం సమయానికి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం రెండు గంటలు దాటేసరికి పోలింగ్ పుంజుకుంది. అప్పటికి పోలింగ్ 46.38 శాతానికి పెరిగింది. 4 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. డుంబ్రిగుడ మండల కేంద్రంలో పోలింగ్ సమయం దాటిన తర్వాత కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరారు.జిల్లా కేంద్రంలోని పాడేరు లో పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీల నాయకుల హడావిడి కనిపించింది. బయట శిబిరాలు ఏర్పాటు చేసి సాధారణ ఎన్నికల వాతావరణాన్ని తలపించారు.
పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దంపతులు, మాజీ ఎమ్మెల్యే గిడ్టీశ్వరి పాడేరులో పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాడేరులోని రెండు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చిన పలువురు పట్టభద్రులు తమ ఓట్లు లేవని నిరాశతో వెనుదిరిగిన పరిస్థితి కనిపించింది. సుమారు 200 మంది ఉపాధ్యాయుల ఓట్లు తాము నమోదు చేయించామని, కేవలం 60 మంది ఓట్లు మాత్రమే ఉన్నాయని ఏపీటీఎఫ్ నాయకుడు జగన్ మోహన్‌రావు తెలిపారు. పాడేరు లోని రెండు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వయంగా వచ్చి పోలింగ్ తీరును పర్యవేక్షించారు.ఒక సచివాలయ ఉద్యోగి పోలింగ్ కేంద్రంలో ఉన్నారని కొందరు ఉపాధ్యాయ సంఘ నాయకులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఆయన స్పందించి ఆ ఉద్యోగిని బయటకు పంపించారు.
పోలింగ్ వివరాలు
ప్రజాశక్తి-పాడేరు టౌన్: పట్టభద్రుల మండలి ఎన్నికలు అల్లూరి జిల్లాలోని పాడేరు డివిజన్ 11 మండలాల పరిధిలో ప్రశాంతంగా ముగిసాయి. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగగా 72.56 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నానికి ఊపందుకుంది. తిరిగి సాయంత్రం కాస్త మందగించింది. అరకువ్యాలీ (149)లో అత్యధికంగా 79.89 శాతం పోలింగ్ జరగగ్గా, చింతపల్లిలో 63.27 అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
11 మండలాల వ్యాప్తంగా మొత్తం 11,525 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 7,861 మంది, మహిళలు 3,661 మంది, ఇతరులు 3 మంది ఉండగా, 8362 మంది ( మహిళలు 2,411, పురుషులు 5,951) ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాడేరు డివిజన్ లోని పోలింగ్ కేంద్రాల వారిగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. హుకుంపేట (148)లో 68.33, హుకుంపేటలో (148శాతం) 71.38, పాడేరు (153)లో 73.33, పాడేరు (154)లో 73.79, అరకు (149) 79.89, అరకు (150) 73.34, జికె వీధి 78.39, సీలేరు 82.14, డుంబ్రిగూడ 71.49, అనంతగిరి 78.52, పెదబయలు 68.9, ముంచింగిపుట్టు 73.37, చింతపల్లి 63.27, కొయ్యూరు 77.41 జి.మాడుగుల 72.37 శాతం పోలింగ్ నమోదైంది. కొయ్యూరు మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో అరకు ఎంపి గొడ్డేటి మాధవి, పాడేరు సుండ్రుపుట్టు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఎపి మెడికల్ కౌన్సిల్ మెంబర్ నర్సింగరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతగిరి:స్థానిక బాలికల పాఠశాల వన్ 152 పోలింగ్ బుత్‌లో మహిళలు 140, పురుషులు 357 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాస్ సందర్శించి ఎన్నికల తీరును పరిశీలించారు.
ముంచింగిపుట్టు: మండల కేంద్రంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలురు పాఠశాల-2లో ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 8.30 గంటల నుంచి పట్టభద్రుల ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరారు. స్థానిక ఎస్సై కె.రవీంద్ర పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. మండలంలో 1059 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. 77.37 శాతంగా పోలింగ్ నమోదు అయింది.మండల కేంద్రంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలురు-2 పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన నెం.146 పోలింగ్ కేంద్రం వద్ద మంచినీటి సదుపాయం కల్పించలేదు. ఓ వైపు మండుటెండ, మరో వైపు టెంట్ ఏర్పాటు చేయకపోవడంతో మండుటెండలో ఓటర్లు క్యూ కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. పట్టభద్రురాలైన పాంగి సరోజిని బాలింతరాలు 45 రోజుల పసికందును ఎత్తుకొని మండుటెండలోనే క్యూ లైన్లో నిలబడింది.
పెదబయలు :స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రంలో ఉదయం 8గంటలకే ప్రారంభమైంది.మండలంలో మొత్తం 1186 ఓట్లకు గాను సాయంత్రానికి 817 ఓట్లు పోలవగా 68.9 శాతం నమోదయ్యింది. పోలింగ్ కేంద్రం వద్ద మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయలేదు. సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఒంటి గంటకు పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటుహక్కును వినియోగించుకున్నారు. అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్‌ఐ పులి మనోజ్ కుమార్ భద్రత ఏర్పాటు చేశారు. వారపు సంతకు ఒడిశా నుంచి వచ్చిన వాహనాలకు దారి మళ్లించారు.
జి.మాడుగుల:మండలంలో 637 ఓటర్లకు గాను 461 ఓటింగ్‌తో 72శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల ఆఫీసర్ నాగరాజు తెలిపారు.సిఐ సత్యనారాయణ, ఎస్‌ఐ శ్రీనివాస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
విఆర్‌ఓకు గుండెపోటు
హుకుంపేట: మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు సోమవారం ఉదయం హాజరైన విఆర్వో అవస్థకు గురయ్యారు. మండలంలో కొట్నాపల్లి పంచాయతీ వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న శోభ. వెంకట్ రమణ విధులకు హాజరై సీరియల్ నెంబర్లు ఇచ్చే కౌంటర్లో కూర్చుని ఉన్నారు. గుండెపోటు రావడంతో కూర్చున్న చోటి కుప్ప కూలిపోయారు. గమనించిన పోలీస్ సిబ్బంది, తహసిల్దార్ రాజ్యలక్ష్మిలు 108 కి ఫోన్ చేశారు. పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో విశాఖపట్నంకు రిఫర్ చేశామని వైద్యులు తెలిపారు.
కలెక్టర్ సందర్శన
హుకుంపేట: మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఎన్నిల జోనల్ అధికారి రమేష్ రామన్, పాడేరు సీఐ సుధాకర్ పర్యవేక్షించారు.తహశీల్దార్ రాజ్యలక్ష్మి, ఎంపిడివో వెంకటరావులు, ఎస్‌ఐ సతీష్‌లు పర్యవేక్షణ చేశారు.
డుంబ్రిగూడ:మండలంలో జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మండలంలో సుమారు 72 శాతం ఓటింగ్ పోలింగ్ జరిగినట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు. పోలింగ్ సమయంలో ఎటువంటి అవంతిక సంఘటనలు జరగకుండా అధికారులు పోలీసులతో పటిష్ట చర్యలు చేపట్టారు.
అరకులోయ:మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సోమవారం ఉదయం 7 గంటలకే పట్టభద్రులు క్యూ కట్టారు. అరకులోయ 149, 150 పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు 1819 మంది ఉండగా, వీరిలో 966 మంది పురుషులు, 430 మంది స్త్రీలు మొత్తం 1396 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తీవ్ర అసౌకర్యానికి గురి అయ్యారు. ఎండలో క్యూలో నిలబడ లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలింగ్ కేంద్రం లోపల సరిగా లైట్లు ఏర్పాటు చేయలేదని పట్టభద్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ప్రశ్నించడంతో స్పందించిన తహసిల్దారు పోలింగ్ కేంద్రం వద్ద చిన్న టెంట్ వేశారు.రెండు పోలింగ్ కేంద్రాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అరకులోయ సిఐ జీడి బాబు, ఎస్‌ఐ సంతోష్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు.
సీలేరు : జీకే వీధి మండలం సీలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు నడుమ నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. సబ్ కలెక్టర్ అభిషేక్ పర్యవేక్షణలో పోలింగ్ బాక్స్‌కు సీల్ వేశారు. నోడల్ అధికారి అభిషేక్, స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ బస్సులో బ్యాలెట్ బాక్సు తరలించారు. చింతపల్లి మండలంలో 1021 ఓట్లు ఉండగా, 646 మంది, జీకే వీధి మండలంలో 384 ఓట్లుగాను 301 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీలేరులో 56 ఓట్లుగా 46 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగాయని సబ్ కలెక్టర్ అభిషేక్ సంతృప్తిని వ్యక్తం చేశారు.
కొయ్యూరు : మండలంలోని ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎంపీ గొట్టేటి మాధవి తోపాటు పట్టు భద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాలుగు గంటలకు ఒక్కసారిగా రద్దీ పెరిగింది. 664 ఓట్లుగాను 514 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 80శాతం పోలింగ్ నమోదైంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొయ్యూరు సీఐ స్వామినాయుడు ఆధ్వర్యంలో కొయ్యూరు మంపై ఎస్సైలు ప్రతిష్టమైన బందోబస్తు నిర్వహించారు.










