Aug 26,2023 12:08

ప్రజాశక్తి - అద్దంకి
సృజన 27వ వార్షికోత్సవం, పద్యశాసన ప్రతికృతి ఆవిష్కరణ 18వ వార్షికోత్సవం, వీరవల్లి రుద్రయ్య సప్తతి వేడుకల సందర్భంగా వీరవల్లి రుద్రయ్య సమర్పిత జీవిత సాఫల్య సృజన సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ రాజకీయ నాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ పూర్వ ఉపసభాపతి, మాజీమంత్రి, తెలుగు భాషాభిమాని, ప్రపంచ తెలుగు మహాసభల గౌరవాధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్‌కు 27న ఆదివారం  శ్రీ శ్రీనివాస ఆర్యవైశ్యకళ్యాణ మండపం నందు అందచేయ నున్నారు. స్వభాషను రక్షించుకుందాం, స్వాభిమానాన్ని పెంచుకుందాం అన్న నినాదంతో దేశ, విదేశాల్లో తెలుగుభాష గరిమను చాటుతూ తెలుగుభాషామతల్లికి ఎనలేని సేవలు అందిస్తున్న మండలి బుద్ధ ప్రసాద్‌ను పద్యం పుట్టిన గడ్డపై, ఎర్రన నడయాడిన నేలపై సత్కరించడం ఒక అదృష్టంగా భావిస్తున్నామని పురస్కార ప్రదాత వీరవల్లి రుద్రయ్య, సృజన వ్యవస్థాపక అధ్యక్షులు భూసురపల్లి వెంకటేశ్వర్లు, సృజన అవార్డు కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు గాడేపల్లి దివాకర దత్త్, పుట్టంరాజు శ్రీరామచంద్ర మూర్తి, సృజన కార్యదర్శి కె అనిలకుమార సూరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఈ  సృజన సాహిత్య పురస్కారాలను ఆచార్య లక్ష్మణ మూర్తి, డాక్టర్‌ సివి సుబ్బన్న, చిట్టిప్రోలు కృష్ణమూర్తి, ఆచార్య పాపిరెడ్డి, నర్సింహారెడ్డి, కరణం బాలసుబ్రహ్మణ్య పిళ్ళె, డాక్టర్‌ గరికపాటి నరసింహారావు, డాక్టర్‌ అద్దేపల్లి రామ మోహనరావు, డాక్టర్‌ పాపినేని శివశంకర్, ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, డాక్టర్‌ వొలుకుల శివశంకర్, గాడేపల్లి సీతారామమూర్తి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్‌ జివి పూర్ణచంద్, ఇప్పగుంట మల్లికార్జున రావు, డాక్టర్‌ గాలిగగుణశేఖర్, నాగభైరవ ఆదినారాయణ, తేళ్ళ అరుణ, పొన్నూరి వెంకట శ్రీనివాసులు, నందిరాజు విజయకుమార్, షేక్ కరీముల్లా, డాక్టర్‌ నూనె అంకమ్మరావు, కుర్రా ప్రసాదు, వడలి రాధాకృష్ణ ప్రభృతులు పాల్గొననున్నట్లు  తెలిపారు.