Nov 13,2023 21:49

నందివానివలసలో సంచరిస్తున్న ఏనుగులు

ప్రజాశక్తి - గరుగుబిల్లి : మండలంలోని గొల్లవానివలస, గొట్టివలస, దలైవలస, టిఆర్‌ఎన్‌వలస, ఉల్లిభద్రలో గత కొన్ని రోజులుగా సంచరిస్తున్న ఏనుగుల గుంపు సోమ వారం నందివానివలస గ్రామ పరిధిలో సంచరించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని గత రెండు రోజుల నుంచి బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అడవులను వీడి జనావాసాల్లో సంచరించడంపై ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు వీటిని అడవులకు ఎందుకు తరలించట్లేదని, ఇప్పటి వరకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వీటిని గ్రామీణ ప్రాంతాల్లో సంచరించేలా చర్యలు చాపాడుతున్నారే తప్ప అటవీ ప్రాంతానికి తరలించడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఏనుగులు వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయి, పంట నష్టం జరిగిన విషయం ప్రభుత్వం దృష్టిలో ఉన్నప్పటికీ, వీటిని తరలించే విషయంలో చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు ఏనుగులను అటవీ ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.