
పెనుమంట్ర మండల సమావేశంలో ఎంపిపి వాసురెడ్డి
ప్రజాశక్తి - పెనుమంట్ర
మండలంలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత పరంగా నిధులు మంజూరు చేస్తున్నామని ఎంపిపి కర్రి వెంకటనారాయణరెడ్డి (వాసురెడ్డి) అన్నారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో పెనుమంట్ర సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి వాసురెడ్డి మాట్లాడుతూ మండలంలోని గరువు గ్రామంలో రూ.40 లక్షలతో నాలుగు సీసీ రోడ్లు, పెనుమంట్రలో రూ.20 లక్షలతో రెండు సీసీ రోడ్ల నిర్మాణాలకు మండల పరిషత్ నుంచి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మండలంలో ఎటువంటి అభివృద్ధి పనులకైనా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాధాన్యత పరంగా నిధులు మంజూరు చేస్తున్నామని, ఏ ఒక్కరూ అసంతృప్తి చెందవద్దని తెలిపారు. అనంతరం ఆగస్టు 15వ తేదీన కలెక్టర్ చేతులమీదుగా అవార్డులు అందుకున్న మండలంలోని అధికారులను, ఇటీవల కాలంలో మండలం నుంచి బదిలీ అయిన అధికారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్ వెలగల వెంకటరమణ (మిస్సమ్మ), జెడ్‌పిటిసి సభ్యులు కర్రి గౌరీ సుభాషిణి, వైస్ ఎంపిపి వాసంశెట్టి కిరణ్, రెండో వైస్ ఎంపిపి ఈది అనిత, ఎంపిడిఒ వి.పూర్ణబాబ్జి, డిప్యూటీ తహశీల్దార్ ఏలియమ్మ, వ్యవసాయ మండల సలహా మండలి మండల కమిటీ ఛైర్మన్ కొవ్వూరి చిన్నారెడ్డి, వైసిపి మండల కన్వీనర్ గూడూరి దేవేంద్రుడు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.