Nov 10,2022 23:51

నర్సీపట్నంలో పోటీలను ప్రారంభిస్తున్న ఎస్‌ఐ



ప్రజాశక్తి -నర్సీపట్నం రూరల్‌: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జగనన్న క్రీడా సంబరాల్లో భాగంగా స్థానిక ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో టౌన్‌ ఎస్సై గోవిందరావు, మండల విద్యాశాఖ అధికారి సాయిశైలజ చేతుల మీదగా మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్‌ పోటీలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై గోవిందరావు మాట్లాడుతూ, క్రీడలు ఆడటంతో మానసిక ఉల్లాసం శారీరకదారుడ్యం కలుగు తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహించడం ఎంతో ఆనందాయకమన్నారు. వివిధ ఉద్యోగాలకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడా పోటీలను ప్రారంభించారు. మండల విద్యాశాఖ అధికారి సాయి శైలజ మాట్లాడుతూ, మండల స్థాయి క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో నర్సీపట్నంకు గుర్తింపు తీసుకు రావాలని క్రీడాకారులను కోరారు. ఈ కార్యక్రమంలో పిడి కె.వరహాల బాబు, శాప్‌ కోచ్‌ అబ్బు, నింజాస్‌ స్పోర్ట్స్‌ అకాడమీ చైర్మన్‌ వెలగా నారాయణరావు, డైరెక్టర్‌ జగన్నాథ్‌, అడిగర్ల సతీష్‌,, బోలెం శివ, పీడీలు రవి, ప్రశాంత్‌ పాల్గొన్నారు.
నేడు పోటీల ఎంపికలు
నాతవరం : మండల స్థాయి సీఎం కప్‌ పోటీల ఎంపికలు ఈనెల 11న శుక్రవారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరుగు తాయని స్థానిక ప్రధానోపాధ్యాయులు శివరాం ప్రసాద్‌ తెలిపారు. వాలీబాల్‌, కబడ్డీ, క్రికెట్‌ మండల స్థాయి ఎంపికలు జరుగుతాయన్నారు. ఈ క్రీడల్లో ఎంపికైన జట్లు నియోజకవర్గం స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
నేడు నియోజకవర్గ స్థాయి పోటీలు
ప్రజాశక్తి -నక్కపల్లి: నక్కపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శుక్రవారం సీఎం నియోజకవర్గ స్థాయి క్రీడా ఎంపికలు నిర్వహించు నున్నట్లు పాయకరావుపేట నియోజక వర్గం క్రీడల ఇన్చార్జ్‌ కుందూరు రాజు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 17 సంవత్సరాలు పైబడిన వారికి కబడ్డీ, వాలీబాల్‌, క్రికెట్‌ సెలెక్షన్స్‌ నిర్వహించినట్లు తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గంలో నాలుగు మండలాలకు సంబంధించి నక్కపల్లిలో ఎంపికలు జరుగుతాయని చెప్పారు. ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు క్రీడా దుస్తులు ధరించి, ఆధార్‌ కార్డుతో హాజరవ్వాలని కోరారు. ఎంపికైన క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయిలలో జరిగే క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు.