Jul 20,2023 23:40

మండల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ప్రజాశక్తి -భీమునిపట్నం : స్థానిక ఎండిఒ కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం ఎంపిపి డివిఎస్‌ఎస్‌ఎన్‌ రాజు అధ్యక్షతన జరిగిన మండల పరిషత్‌ సభ్యుల సాధారణ సమావేశంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి సభ్యులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఏకరువు పెట్టారు. ప్రాధాన్యత వారీగా సమస్యలు పరిష్కరించాలని సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆయా శాఖలు, విభాగాల అధికారులను ఆదేశించారు.
తాళ్ళవలస ఎంపిటిసి సభ్యులు కోరాడ రమణ మాట్లాడుతూ, గొల్లల తాళ్ళవలస నుంచి పిహెచ్‌సికి వెళ్లే రోడ్డు గతుకుల మయంగా ఉందని, గర్భిణిలు అవస్థలు పడుతున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. తాళ్ళవలస గ్రామ పేదలకు దూరంగా ఉన్న ఆనందపురం మండలం మచ్చవానిపాలెంలో ఇళ్ళ స్థలాలు కేటాయించడం వల్ల ఉపయోగం లేదన్నారు. యాతపేటలో రోడ్లు, కాల్వలు నిర్మించాలని కోరారు.
చిప్పాడ టిడిపి ఎంపిటిసి సభ్యులు చుక్క ఈశ్వరమ్మ మాట్లాడుతూ, గ్రామంలో నిర్మించిన ఆర్‌బికె కేంద్రానికి పర్యవేక్షణ లేక అప్పుడప్పుడు మందు బాబులకు నిలయంగా మారిందని వాపోయారు. పంచాయతీ పరిధిలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాలకు సచివాలయ అధికారులు ప్రోటోకాల్‌ పాటించడం లేదని ఆరోపించారు. టి.నగరపాలెం ఎంపిటిసి సభ్యులు పల్లా నీలిమ మాట్లాడుతూ, టి.నగరపాలెంలో ఆర్‌ అండ్‌ బి రోడ్డు మంజూరై దాదాపు రెండేళ్లు గడిచినా సరే నేటికీ నిర్మాణం పూర్తి కాలేదని వాపోయారు. దాకమర్రి ఎంపిటిసి సభ్యులు చెల్లూరి నగేష్‌బాబు మాట్లాడుతూ, బిటి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. బోడమెట్టపాలెం సర్పంచ్‌ ముద్దాడ అప్పయ్యమ్మ మాట్లాడుతూ కొన్ని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ప్రభుత్వ స్థలాల్లో రోడ్లు వేస్తున్నా, చెరువు కప్పేస్తున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణరాజుపేట సర్పంచ్‌ కాద సూర్యనారాయణ మాట్లాడుతూ, ప్రజలకు ఉపయోగ పడేలా రెండు రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు.
జలజీవన్‌ మిషన్‌ పథకం కింద ప్రతి గ్రామంలో ఇంటింటి కుళాయిలు, యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటుచేసి రక్షిత నీరు అందించాలని ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఇ దుర్గాంబ, ఎఇ, రేఖను ఎమ్మెల్యే ఆదేశించారు. నిర్ణీత గడువులోగా జగనన్న ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేయాలని హౌసింగ్‌ రూరల్‌ ఎఇ ఎం.హుస్సేన్‌ను ఆదేశించారు. జెడ్‌పిటిసి సభ్యులు గాడు వెంకటప్పడు, వైస్‌ ఎంపిపి బోని బంగారునాయుడు, ఎఎంసి చైర్మన్‌ యలమంచిలి సూర్యనారాయణ, ఎఎంసి వైస్‌ చైర్మన్‌ బోని అప్పలనాయుడు, తహసీల్దార్‌ కోరాడ వేణుగోపాల్‌, ఎండిఒ పి.వెంకటరమణ, వివిధ శాఖలు, విభాగాల అధికారులు పాల్గొన్నారు
ప్రజాప్రతినిధులు కాని వారు హాజరు..
మండల సమావేశానికి కొంతమంది మహిళా ఎంపిటిసి సభ్యులు, సర్పంచ్‌ల స్థానంలో వారి భర్తలు, కుమారులు, బంధువులు, అధికార పార్టీ నాయకులు హాజరు కావడం పట్ల పలువురు విస్మయం వ్యక్తంచేశారు. ఇది ఏ రకమైన సంప్రదాయమో నిర్వాహకులే ఆలోచించాలని పలువురు అభిప్రాయపడ్డారు.
జాతీయ నేతల విగ్రహాలు పున్ణప్రారంభం
మండల పరిషత్‌ కార్యాలయ ప్రాంగణంలో నెలకొల్పిన పలువురు జాతీయ నేతల విగ్రహాలను స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పున్ణప్రారంభించారు.