Feb 23,2023 23:35

మండల పరిషత్తు సమావేశంలో మాట్లాడుతున్న పరవాడ ఎంపిపి వెంకట పద్మలక్ష్మి

ప్రజాశక్తి-సబ్బవరం
మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో సమస్యలు వెల్లువెత్తాయి. స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో గురువారం ఎంపీపీ బోకం సూర్యకుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. ఎంపీపీ బోకం సూర్యకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ భూముల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహశీల్దార్‌ వెంకట్‌ను ఆదేశించారు. ఎస్‌సి, ఎస్‌టిలకు విద్యుత్‌ బిల్లుల్లో ప్రభుత్వం ఇస్తున్న రాయితీ అమలు చేయాలని, ల్యాండ్‌ పూలింగ్‌లో భూములు కోల్పోయిన రైతులకు అభివృద్ధి చేసిన భూములు అప్పగించాలని, వంగలిలో రింగు రోడ్డు కోసం కేటాయించిన స్థలాన్ని సర్వే చేయాలని, అమృతపురం వైఎస్సార్‌ కాలనీలో ఆక్రమణలు తొలగించాలని, ఎల్లుప్పి కొండ నుండి ఎక్స్‌ప్రెస్‌ హైవేకు సబ్‌ కాంట్రాక్టర్‌ గ్రావెల్‌ అక్రమంగా తవ్వి తరలించడంపై చర్యలు తీసుకోవాలని తదితర సమస్యలపై జెడ్‌పి వైస్‌ చైర్మన్‌, సభ్యులు విజ్ఞప్తి చేశారు. సబ్బవరం మండలంలో ఎక్కడా లేని విధంగా 172 వరకు కోర్టు కేసులు ఉండడంతో రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతుందని డిటి వెంకట్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్‌ నాయుడు, ఎఒ షేక్‌ బాబురావు, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ విరోతి చిన అప్పల నాయుడు, సర్పంచ్‌లు వడ్డాది అప్పలరాజు, కర్రి నర్సింగరావు, ఆకుల శ్రీహేమ, మామిడి శంకరరావు, ఎంపీటీసీలు కర్రి అప్పారావు, గొర్లి కృష్ణ చైతన్య, జి.కనకరాజు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
మొక్కుబడిగా మండల సమావేశం
పరవాడ : పరవాడ మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం మండల పరిషత్‌ సమావేశం ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మి శ్రీనివాసరావు అధ్యక్షతన మొక్కుబడిగా జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్‌ కోడ్‌ కారణంగా ఎటువంటి తీర్మానాలు చెయ్యలేదు. సభలో ప్రజా ప్రతినిధులు పలు సమస్యలు సభ దృష్టికి తీసుకుని రాగా, మండల అధికారులు వాటికి సూటిగా సమాధానాలు చెప్తూ సభను కొనసాగించారు. ముఖ్యంగా ఆర్‌ అండ్‌ బి రోడ్లు, జగనన్న హౌసింగ్‌ కాలనీల్లో మౌలిక సదుపాయాలు, అసంపూర్తిగా వున్న అంగన్వాడీ భవనాలు విషయమై సభ్యులు ప్రశ్నలు అడిగారు. సమావేశానికి రెవెన్యూ అధికారులు గైర్హాజరు కావడంపై వివరణ కోరాలని ఎంపిడిఒ హేమ సుందరరావును ఎంపీపీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైల సన్యాసిరాజు, వైస్‌ ఎంపిపిలు బంధం నాగేశ్వరరావు, బూస అప్పలరాజు, ఏఓ ఆశా, మండల వ్యవసాయ సలహామండలిఅధ్యక్షులు కోన రామరావు, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.