May 26,2023 00:15

అధికారులను ప్రశ్నిస్తున్న వైస్‌ ఎంపిపి1 సత్యనారాయణ

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండల కేంద్రంలోని గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడీ వేడీగా సాగింది. ఈ సమావేశంలో మండల వైస్‌ ఎంపీపీ1 పాటు భోయి సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా సంస్థల ఉపాధ్యాయులు విద్యాబోధన సక్రమంగా అందించ లేదని మండిపడ్డారు. ఉపాధ్యాయులు ఏ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారో అదే పాఠశాలలో వారి పిల్లలను చదివించాలని డిమాండ్‌ చేశారు. మండల పరిధిలో ఆరు పాఠశాలలకు భవనాలు లేవని, వాటిని వెంటనే పున:ప్రారంభం చేయాలని డిమాండ్‌ చేశారు.
లక్ష్మీపురం సర్పంచ్‌ కోర్ర త్రినాథ్‌, దారెల సర్పంచ్‌ పాంగి పాండురంగ స్వామి, వనబసింగి సర్పంచ్‌ లక్ష్మణ్‌ లు మాట్లాడుతూ, వైద్య శాఖలో పూర్తిస్థాయిలో మందులు ఉండ లేదని, వైద్య సిబ్బంది కొరతతో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించలేకపోతున్నారని తెలిపారు.మెడికల్‌ మెయింటినెన్స్‌ చార్జీలు ఎప్పటికప్పుడు కమిటీ ద్వారా నివేదిక చూపాలని డిమాండ్‌ చేశారు. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లో ఒక విడతకు ఎంత గ్రాంటు వస్తుందో హెల్త్‌ చైర్మన్‌తో పాటు సభ్యులకు తెలియపరచి చర్చ జరపాలని డిమాండ్‌ చేశారు. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ లో డాక్టర్ల, స్టాప్‌ నర్సుల కొరత ఉందని పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకాలు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు.
తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, గ్రావిటీలు, జలజీవన్‌ మిషన్‌ స్కీం నిర్మాణాలలో జాప్యం జరుగుతోందని స్థానిక సర్పంచ్‌ సుభాష్‌ చంద్ర తెలిపారు.
గిరిజన సంఘం నిరసన
సంతబైలు వీధిలో తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని గిరిజన సంఘం, గిరిజన మహిళా సంఘం ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం మందిరం వద్ద నిరసన చేపట్టారు. అధికారులు సమాధానం చెప్పాలని మందిర ఆవరణలో బైఠాయించారు. ఆర్డబ్ల్యూఎస్‌ జేఈ రాతపూర్వక హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
మాకవర గ్రామ సమీపంలో నల్లరాయి క్వారీ తక్షణమే తొలగించాలని గిరిజన సంఘం ఆధ్వర్యంలో తహసిల్దార్‌కు జనరల్‌ బాడీ సమావేశం మందిరం వద్ద వినతి పత్రాన్ని ఇచ్చారు. వ్యవసాయ భూములు, పంటలు నష్టపోయిన రైతులకు పంట నష్టం, ఒక కుటుంబానికి రెండు లక్షలు చెల్లించాల్నఇ నాయకులు తెలిపారు. , క్వారీలో కూలీ చేస్తూ మతి చెందిన క్వారీ కార్మికుల ఒక్కొక్క కుటుంబనికి 20 లక్షల యాక్సిగ్రేషియా తక్షణమే చెల్లించాలని తహసిల్దార్‌ నర్సమ్మకు వినతి ఇచ్చారు. బినామీ పేరున నడుపుతున్న నల్ల రాయి క్వారీనీ తక్షణమే మూసివేసి బినామీగా ఉన్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. బినామీగా ఉన్న వ్యక్తిని చట్టపరమైన చర్యలకు (శిక్ష) అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మైదాన ప్రాంతం నుండి వచ్చి నల్లరాయి కోరిని నిర్వాసిస్తున్న హనుమంతరావును చీటింగ్‌ కేసు, నమోదు చేసి తక్షణమే రిమాండ్‌ కు తరలించాలని కోరారు.
బోయ/వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తే ఊరుకోమంటూ మండల సర్పంచులు, ఎంపీటీసీలు వినతి పత్రాన్ని స్థానిక ఎంపీడీవోకు అందజేశారు. వైసిపి మండల అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ ఎస్టీ జాబితాలో చేర్పిస్తే మండలంలో ఉన్న సర్పంచ్‌, ఎంపీటీసీలు పదవులకు రాజీనామా చేసి గిరిజనుల హక్కుల చట్టాలను కాపాడుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామన్నారు. అనంతరం అన్ని శాఖల వారీగా సమీక్ష నిర్వహించి సమావేశాన్ని ముగించారు.