Nov 03,2022 23:42

మండల సమావేశంలో సమస్యలపై నిలదీస్తున్న సర్పంచులు

ప్రజాశక్తి -ఆనందపురం : మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం ఎంపిపి మజ్జి శారదా ప్రియాంక ఆధ్వర్యాన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పలు సమస్యలపై సర్పంచులు నిలదీశారు. ఈ సమావేశానికి భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. పార్టీలకతీతంగా సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. అభివృద్ధి పనుల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఐక్యంగా పనిచేయాలన్నారు. జగనన్న కాలనీలను త్వరగా పూర్తిచేసి మౌలిక వసతులు అందించాలని అధికారులు ఆదేశించారు. గ్రామాల్లో సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
సమస్యలపై సర్పంచుల నిలదీత
పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంతో అభివృద్ధి కుంటుపడుతోందని మామిడిలోవ సర్పంచ్‌ బలిరెడ్డి మల్లికార్జునరావు నిలదీశారు. నిలదీస్తున్న మల్లికార్జునరావును గండిగుండం సర్పంచ్‌ గన్రెడ్డి శ్రీను నిలువరించడానికి ప్రయత్నించారు. ఇది ప్రతిపక్షాల వాదన కాదని, సర్పంచ్‌ల ఆవేదనని మల్లికార్జునరావు ఘాటుగా సమాధానం చెప్పారు. బోని సర్పంచ్‌ బోని అప్పలకొండ సన్యాసిరావు మాట్లాడుతూ, పంచాయతీకి రూ.18 లక్షలకుపైగా విద్యుత్‌ బిల్లు వచ్చిందని, దీనికి దఫదఫాలుగా పంచాయతీ నిధులను మళ్ళిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలవలస సర్పంచ్‌ నాగోతి అచ్చియ్యమ్మనరిసమ్మ మాట్లాడుతూ, పాలవలసలో జగనన్న ఇళ్లు మంజూరైనా ఇంతవరకు బిల్లులు మంజూరు కాలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపిలు పాండ్రంకి శ్రీను, బొట్ట ధనలక్ష్మి, జడ్‌పిటిసి కోరాడ వెంకటరావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మజ్జి వెంకటరావు, మండల పార్టీ ప్రెసిడెంట్‌ బంక సత్యం, మార్కెట్‌ చైర్మన్‌ ఎలమంచిలి సూర్యనారాయణ, వైస్‌ చైర్మన్‌ బోని అప్పలనాయుడు, ఎంపిడిఒ లవ రాజు, తహశీల్దార్‌ లోకవరపు రామారావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.