
ప్రజాశక్తి - కొత్తవలస : స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపిడిఒ వై పద్మజ ఆధ్వర్యంలో ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం నుంచే వాడి వేడిగా చర్చ జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాసరావు రెవెన్యూ పరంగా సమస్యలు తీవ్రతరంగా ఉన్నాయని, వీటి పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని డిప్యూటీ తహశీల్దారు రమేష్‌కు సూచించారు. శాశ్వత భూహక్కు సర్వే చేయించాలని సర్పంచులు, ఎంపిటిసిలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రెవెన్యూ పరంగా ప్రత్యేక సమావేశం పెట్టి పరిష్కరించుకుందామని తెలిపారు. మండలంలో భూమి రీ సర్వే అనంతరం, పాసు బుక్కుల కేటాయింపు సమయంలో గతంలో కొనుగోలు, అమ్మకాలు జరిపిన వారి పేర్లు కూడా చేర్చడం వల్ల రాబోయే రోజుల్లో సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని దీని వల్ల గ్రామాలలో ఉన్న ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చిన్నరావుపల్లి సర్పంచ్ భూసాల దేవుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. నిమ్మలపాలెం సర్పంచ్ కొట్యాడ నిర్మల సాయి సభలోనే ఉన్నా ఆమె భర్త కొట్యాడ శ్రీను సభ్యుడు కాకపోయినా సమావేశంలో పాల్గొని అధికారులను పలు అంశాలపై ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. మంగళ పాలెం సర్పంచ్ కుమారుడు పొలమరశెట్టి అనిల్ కూడా ఎటువంటి పదవి లేకపోయినా సభలో పాల్గొన్నారు. సభలో సభ్యులు కానీ వారు ప్రాతినిధ్యం వహించడంపై మిగిలిన నాయకులు పెదవి విరిస్తున్నారు. సభ్యులు కాని వారిని ఎంపిడిఒ కనీసం బయటకు పంపించే ప్రయత్నం కూడా చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న సమగ్ర భూహక్కు సర్వే వల్ల జరిగిన అవకతవకలకు గ్రామాలలో గ్రామ సభ రెవెన్యూ అధికారులు నిర్వహించాలని, ఈ సమస్యకు పరిష్కారం చూపాలని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, జెడ్‌పిటిసి నెక్కల శ్రీదేవి, వైస్ ఎంపిపి మేలాస్త్రి సరస్వతి, కర్రీ శ్రీనివాసరావు, ఇఒపిఆర్‌డి కర్రీ ధర్మారావు, ఇతర శాఖల అధికారులు సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.