ప్రజాశక్తి - ముంచింగిపుట్టు: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపిటిసిలు, సర్పంచ్‌లు సమస్యలపై ఏకరువు పెట్టారు. ఎంపిపి అరిసెల సీతమ్మ అధ్యక్షతన ఎంపిడిఒ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో వివిధ శాఖల అధికారులు అజెండా ప్రకారం నివేదికలు వినిపించారు. విద్యాశాఖపై జరిగిన చర్చలో రంగబయలు పంచాయతీ పరిధిలో నాలుగు పాఠశాలలకు భవనాలు, ఉపాధ్యాయులు లేరని సర్పంచ్ ధనియా విన్నవించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల విధినిర్వహణ, సమయపాలనపై లక్ష్మీపురం, వనబసింగీ, కిలగడ, కించాయి పుట్టు పంచాయతీ సర్పంచులు ఎంఇఒను ప్రశ్నించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఇతరుల ప్రవేశాలకు ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయడం సరికాదన్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పలువురు విద్యార్థులు అనారోగ్యాలతో మృత్యువాత పడుతున్నా, జిల్లా కలెక్టర్, ఐటిడిఎ పిఒలు స్పందించపోవడంపై పలువుఉఉ మండిపడ్డారు. పాఠశాలల్లో రెండో విడత నాడునేడు పనుల్లో నాణ్యత, జాప్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆరోగ్య శాఖపై జరిగిన చర్చలో వైద్యులు, సిబ్బంది ఖాళీలను భర్తీచేసి, వైద్యసేవలను మెరుగుపరచాలని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు భోజన సదుపాయాలు కల్పించాలని కోరారు. వ్యవసాయ శాఖపై జరిగిన చర్చలో ప్రభుత్వం సరఫరా విత్తనాలతో రైతులకు మంచిదిగుబడులు వచ్చాయని వ్యవసాయ శాఖాధికారి మోహనరావు తెలిపారు.అధిక కరెంటు బిల్లులపై సభ్యులు ప్రశ్నించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సమస్యలపై తక్షణం స్పందించి పరిష్కరిస్తామనివిద్యుత్ శాఖ అధికారులు భరోసానిచ్చారు. గృహనిర్మాణంలో జాప్యం నివారణకు ఎంపిడిఒ, తహశీల్దార్ పర్యవేక్షణ చేయాలని వనుగుమ్మ, రంగబయలు పంచాయతీ ప్రజల తరపున సంబంధిత సభ్యులు ఎంపిడిఒకు వినతిపత్రం అందించారు. విద్యుత్ బిల్లులు తగ్గించాలని సభ్యులు విన్నవించి, ఎంపిడిఒకు అర్జీలిచ్చారు.










