ప్రజాశక్తి -బుచ్చయ్యపేట
బుచ్చయ్యపేట మండలం పేరుకే మండల కేంద్రం. కనీస అవసరాలు లేక అవస్థలు పడుతున్న వైనం. ఏజెన్సీలోని అన్ని మండలాలకు సైతం ఆర్టీసీ బస్సు సౌకర్యాలు ఉన్నాయి కాని బుచ్చయ్యపేట మండల కేంద్రానికి ఒక్క బస్సు కూడా నడవని పరిస్థితి. అయినా పాలకులకు అధికారులకు పట్టదు. దీంతో వందలాదిమంది ఉద్యోగులు, విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. విశాఖ జిల్లాలోని మైదాన ప్రాంతాలన్నింటిలోనూ బుచ్చయ్యపేట మండల కేంద్రాన్నిది ఒక ప్రత్యేక పరిస్థితి. ఒకవైపు చోడవరం మరొకవైపు రావికమతం, మరొకవైపు అనకాపల్లి, మరో వైపు కసింకోట మండల సరిహద్దులకు మధ్యలో బుచ్చయ్యపేట మండలం ఉంది. ఈ మండల కేంద్రానికి ఏ విధమైన రవాణా అవకాశాలు లేవు. గతంలో బుచ్చయ్యపేట మండల కేంద్రాన్ని కలుపుతూ విశాఖపట్నం నుండి చోడవరం, వడ్డాది, బుచ్చయ్యపేట కెపి.అగ్రహారం మీదుగా పెద్ద మదిన బస్సు, విశాఖపట్నం నుండి చోడవరం, వడ్డాది, రాజాం మీదుగా గంప ఒక బస్సు నడుస్తుండేవి. పదేళ్ల క్రితం గొంప విశాఖపట్నం బస్సును అధికారులు రద్దు చేశారు. తదనంతరం పెద్దమదినా -విశాఖపట్టణం బస్సు ప్రతిరోజు రెండు ట్రిప్పులు తిరుగుతూ ఉండేది. దీంతో మండల కేంద్రానికి రాకపోకలు సాగించే వారికి కాస్త రవాణా సౌకర్యం ఉండేది. బుచ్చయ్యపేట మండలం మైదాన ప్రాంతంలో ఉన్న సరైన రవాణా సౌకర్యాలు, రోడ్డు సౌకర్యాలు లేక ప్రయాణికులకు వివిధ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు, పలు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు, ఇబ్బందులు పడుతూ ఉండేవారు. మండలంలోని పలు గ్రామాల నుండి వందలాది మంది విద్యార్థులు చోడవరం, వడ్డాది తదితర ప్రాంతాల్లో ఇంటర్, డిగ్రీ చదువుకోవడానికి రాకపోకలు సాగిస్తూ ఉంటున్నారు. సరైన బస్సు సౌకర్యం లేక మండలంలోని కొండపాలెం, గుండెటంపూడి, కేపీ అగ్రహారం, బుచ్చయ్యపేట, కందిపూడి, పోలేపల్లి, దిబ్బిడి, చిన్నప్పన్నపాలెం, పి.భీమవరం తదితర గ్రామాలకు చెందిన విద్యార్థులు కళాశాలలకు వెళ్లి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాలలో ఆటోలను, ద్విచక్ర వాహనాలను ఆశ్రయించి రాకపోకలు సాగిస్తూ ఉండేవారు.
ఉన్న ఒక్క బస్సు ఆగింది
బుచ్చయ్యపేట మండల కేంద్రం మీదగా రాకపోకలు సాగించే పెద్ద మదిన బస్సు గత ఆరు నెలలుగా రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దేరు వంతెన బ్రిడ్జి కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వడ్డాది, దిబ్బిడి, బుచ్చయ్య పేట బస్సును వారం రోజులపాటు చోడవరం పిఎస్ పేట బెన్నవోలు పోలేపల్లి బుచ్చయ్యపేట మీదుగా పెద్ద మదిన వరకు తిప్పారు. అనంతరం విశాఖపట్నం చోడవరం వరకు మాత్రమే తిప్పుతున్నారు. గత ఐదు నెలలుగా మండల కేంద్రానికి బస్సు సౌకర్యం నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు పలు శాఖల్లో పని చేసే ఉద్యోగులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ పాలకులకు అధికారులకు ఏమాత్రం పట్టడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల కష్టాలు వర్ణనాతీతం. బస్సు సౌకర్యం లేక ఆటోలపై కళాశాలకు వెళ్లే ఆర్థిక స్తోమత లేక పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు ఉదయం 8 గంటలకే గ్రామాలలో బయలుదేరి కాలినడకన వడ్డాది వరకు ఐదు నుండి పది కిలోమీటర్ల దూరం నడుస్తున్నారు. సాయంత్రం సమయంలో సైతం ఇంటికి చేరడానికి నాన ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మండల కేంద్రానికి బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కోరుతున్నారు.










