రెండు జిల్లాల్లో మూడున్నర లక్షల ఎకరాల్లో సాగు
ఇప్పటి వరకూ 70 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు
జనవరి రెండో వారం వచ్చినా 20 శాతం దాటని దుస్థితి
నెలాఖరు వరకూ నాట్లు కొనసాగే అవకాశం
20వ తేదీ తర్వాత వంతుల విధానం అమల్లోకి!
కొల్లేరు భూములు ఇ-క్రాప్ సంగతేమిటి?
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
రెండు జిల్లాల్లోనూ మందకొడిగా రబీనాట్లు సాగుతున్నాయి. ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో నెలకొన్న ఆలస్యం రబీ సాగుపై పడింది. దీంతో జనవరి రెండో వారం వచ్చినా 20 శాతం మాత్రమే రబీ నాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుత రబీలో పశ్చిమగోదావరి జిల్లాలో 2.50 లక్షల ఎకరాలు, ఏలూరు జిల్లాలో 1,09,895 ఎకరాల్లో రైతులు రబీ సాగు చేస్తున్నారు. ఖరీఫ్ మాసూళ్లు త్వరితగతిన పూర్తయినప్పటికీ ధాన్యం కొనుగోలులో నెలకొన్న ఇబ్బందులతో రైతులు రబీ సాగులో ముందుకెళ్లలేకపోయారు. దీంతో జనవరి రెండోవారం వచ్చినప్పటికీ పశ్చిమగోదావరి జిల్లాలో 43 వేల ఎకరాల్లో, ఏలూరు జిల్లాలో 27 వేల ఎకరాల్లో మాత్రమే రబీ నాట్లు పూర్తయ్యాయి. అంటే రెండు జిల్లాల్లోనూ కలిపి 20 శాతం వరకూ నాట్లు జరిగాయి. ఇంకా దాదాపు 80 శాతం నాట్లు వేయాల్సి ఉంది. జనవరి నెలాఖరు వరకూ రబీ నాట్లు సాగే అవకాశం ఉందని దీన్నిబట్టి తెలుస్తోంది. జనవరి 20వ తేదీ తర్వాత వంతులవారీ విధానం అమల్లోకి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రైతులు సాగునీటి సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. దీంతో రైతుల్లో ఒకింత ఆందోళన సైతం నెలకొంది. రబీలో నాట్లు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు తగిన చర్యలు తీసుకోలేకపోయారనే చర్చ నడుస్తోంది. రెండు జిల్లాల్లోనూ అత్యధికంగా బెంగాలీ కూలీలు రబీ నాట్లు వేసే ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఎకరానికి రూ.నాలుగు వేలు చొప్పున కాంట్రాక్ట్‌కు తీసుకుని జిల్లాలో నాట్లు వేస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు రబీ మాసూళ్ల సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళన సైతం ఇప్పటి నుంచే వెంటాడుతోంది. ఖరీఫ్‌లో తెచ్చిన నూతన ధాన్యం కొనుగోలు విధానంపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. తేమశాతం, తూకం తేడాల పేరుతో రైతుల నుంచి మిల్లర్లు డబ్బు తిరిగి కట్టించుకోవడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే పరిస్థితి రబీలో ఎదురైతే ఏమిటనే ప్రశ్న రైతులను వెంటాడుతోంది.
కొల్లేరు భూములకు ఇ-క్రాప్ ఎలా..!
రెండు జిల్లాల పరిధిలోని దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు, ఆకివీడు, కైకలూరు వంటి పలు మండలాల పరిధిలో కొల్లేరు భూముల్లో రైతులు సాగు చేశారు. వీటిని అనసరి భూములంటారు. ఈ భూములకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉండవు. వందల ఏళ్ల నుంచి రైతులు పన్ను కట్టి సాగు చేసుకుంటున్న భూములివి. ఇ-క్రాప్ కాని భూములకు సంబంధించి ధాన్యం కొనుగోలు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. మరీ పట్టాదారు పాస్ పుస్తకాలు లేని కొల్లేరు భూములను రైతులు ఇ-క్రాప్ ఏవిధంగా చేసుకోవాలనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇ-క్రాప్ చేయకపోతే రబీ సాగు పూర్తయ్యాక రైతులు ధాన్యం ఏవిధంగా విక్రయించాలో తెలియని పరిస్థితి ఏర్పడనుంది. కొల్లేరులో సాగైన వరి భూములకు సంబంధించి ఇ-క్రాప్ నమోదుపై జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటి నుంచే సరైన నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రబీ ధాన్యం కొనుగోలులో ఇబ్బంది పెడితే తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందని చెబుతున్నారు. కొల్లేరు భూముల్లోని ధాన్యం కొనుగోలుపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.










