Jun 14,2023 23:54

రాజధాని ప్రాంతం ఆర్‌5 జోన్‌లోని లే అవుట్‌

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : రాజధాని అమరావతి పరిధిలో గుంటూరు, ఎన్‌టిఆర్‌ జిల్లాలకు చెందిన 50,793 మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ మందకొడిగా సాగుతోంది. గతనెల 26న ఇళ్ల పట్టాల పంపిణీని సిఎం జగన్‌ తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ప్రారంభించారు. వారంలోగా పట్టాల పంపిణీని పూర్తి చేయాలని అదేరోజున అధికారులను సిఎం ఆదేశించారు. వచ్చే నెల 8వ తేదీన ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని, అప్పటికి తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సిఎం ఆదేశించి మూడు వారాలు దాటినా ఇప్పటి వరకు పట్టాల పంపిణీ పూర్తి కాలేదు. గత 20 రోజుల్లో 30,500 మందికే పట్టాలను అందించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇంకా 20,293 మందికి పట్టాలు పంపిణీ చేయాల్సిఉంది.
సిఆర్‌డిఎ పరిధిలోని ఆర్‌-5 జోన్‌óతో పాటు గృహనిర్మాణాలకు కేటాయించిన ఎస్‌-3జోన్‌లో కూడా భూములలో పేదలకు ఇళ స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం మొత్తం 25 లేవుట్లను ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా పరిధిలో 11 లే అవుట్లలో 23,762 మంది, ఎన్‌టిఆర్‌ జిల్లా పరిధిలో 14 లేఅవుట్లలో 27,031 మందికి స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం 80 వేల హద్దురాళ్లు తెప్పించారు. మొదటి దశలో ఆర్‌-5 జోన్‌లో లేఅవుట్లలో కొన్నింటిలో కనీస మౌలిక వసతులు పూర్తికాకపోవడం వల్ల కూడా పట్టాల పంపిణీలో జాప్యమవుతున్నట్లు తెలిసింది. ఆర్‌-5 జోన్‌లో కాకుండా అదనంగా ఎస్‌-3 జోన్‌లో తీసుకున్న 268 ఎకరాలకు సంబంధించిన లే అవుట్ల నిర్మాణం పూర్తికాలేదు. దీంతో దాదాపు 8 వేల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తి కాలేదని తెలిసింది. వీరిలో ఎన్‌టిఆర్‌, గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులు ఉన్నారు. మాస్టర్‌ ప్లాన్‌లోని ఎస్‌-3 జోన్‌లో పరిధిలోని బోరుపాలెం, పిచ్చుకలపాలెం, అనంతరం, నెక్కలు గ్రామాలలో పేదలకు ఇళ్ల స్థలాల నిమిత్తం తీసుకున్న 268 ఎకరాల్లో లే అవుట్‌ల నిర్మాణం పూర్తికాకపోవడం వల్ల ప్లాట్ల ఏర్పాటులో జాప్యమై లబ్ధిదారులను లేఅవుట్ల వద్దకు తీసుకురావడంలో ఆలస్యమవుతోంది.
మొత్తం 25 లేఅవుట్లపరిధిలో 232 కిలో మీటర్ల పొడవున గ్రావెల్‌ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇళ్ల స్థలాల్లో మౌలిక వసతుల కోసం రూ.700 కోట్లు, 50,793 మందికి ఇళ్లనిర్మాణం నిమిత్తం రూ.1280 కోట్లు కేటాయించినట్టు అధికారులు తెలిపారు. మొత్తం 25 జగనన్న కాలనీలలో 50,793 మందికి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రభుత్వం మూడు ఆప్షన్లను లబ్ధిదారులకు కేటాయించింది. మొదటి ఆప్షన్‌లో సొంతంగా ఇల్లు కట్టుకుంటే లభ్ధిదారుల బ్యాంకు ఖాతాలో విడతల వారీగా రూ.1.80 లక్షలు జమచేస్తారు. రెండో ఆప్షన్‌గా ఇంటి నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్‌ అందించడంతో పాటు కూలీల ఖర్చును బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. మూడో ఆప్షన్‌గా ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వడంగా పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తికాకపోవడం వల్ల ఇంకా ఆప్షన్‌ల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు.