Sep 22,2023 21:17

ఇ-క్రాప్‌ నమోదు చేస్తున్న వ్యవసాయ శాఖ సిబ్బంది

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  జిల్లాలో ఇ-క్రాప్‌ నమోదు నత్తనడకన సాగుతోంది. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 3,09,835 ఎకరాల మేర వ్యవసాయ పంటలు, 1,11,235 ఎకరాల వరకు ఉద్యాన పంటలకు ఇ-క్రాప్‌ నమోదు చేయాల్సి ఉంది. వ్యవసాయ, ఉద్యాన పంటలు కలిపి ఇప్పటి వరకు 54 శాతం మాత్రమే నమోదైంది. ముఖ్యంగా 70 శాతం నవ్వులపంట గుర్తింపునకు నోచుకోలేదు. దీంతో, ఈ ఏడాది పంటల నష్టపరిహారం, బీమా వర్తింపుపై రైతుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. వ్యవసాయశాఖ అధికారులు మాత్రం సాంకేతిక కారణాలను సాకుగా చూపుతున్నారు.
పంటలకు ఇ-క్రాప్‌ నమోదు ఆధారంగానే ప్రభుత్వం పంట నష్టపరిహారం, బీమా, సున్నావడ్డీ పథకాలు వర్తింపజేస్తున్న విషయం విదితమే. వీటితోపాటు ఉత్పత్తులను కొనుగోలు చేసి, వాటికి కనీస మద్దతుధర కల్పించేందుకు కూడా ఇ-క్రాప్‌తోనే ప్రభుత్వం ముడిపెట్టింది. విజయనగరం జిల్లాలో ఇ-క్రాప్‌ కింద గుర్తింపు పొందని రైతులు, ముఖ్యంగా ధాన్యం విక్రయంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఇ-క్రాప్‌ నమోదు అనేది రైతులకు అత్యంత కీలకంగా మారింది. అమలు విషయంలో లక్ష్యానికి దూరంగా ఉండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ అత్యంత ప్రాధాన్యతగలది. ఎక్కువ భూభాగంలో వర్షాధారంగానే పంటలు సాగవుతాయి కాబట్టి రబీలో పంటలు నామమాత్రమే. ఖరీఫ్‌ సీజన్‌లో వరి, మొక్కజొన్న, పత్తి, చెరకు, నువ్వులు, రాగులు, చిరుధాన్యాలు తదితర పంటలు కలిపి సుమారు 4 లక్షల ఎకరాల్లో సాగవుతాయి. ఇందులో అత్యధికంగా వరి 2,23,025 ఎకరాల్లో సాగవుతుంది. ఆ తరువాత స్థానంలో మొక్కజొన్న, పత్తి, చెరకు ఉన్నాయి. వీటితోపాటు మిగిలిన అన్నిపంటలూ కలుపుకుని ఇప్పటి వరకు 2,41,756 ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా వరి 1,94,477 ఎకరాల్లో సాగైంది. ఇందులో ఇప్పటివరకు కేవలం 1,38,000 ఎకరాలకు మాత్రమే ఇ-క్రాప్‌ నమోదైంది. మొక్కజొన్న 37,728 ఎకరాలు సాధారణ విస్తీర్ణం కాగా, 48 శాతం, పత్తి 73 శాతం చొప్పున ఇ-క్రాప్‌ నమోదు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. నువ్వుల పంట 9,817 ఎకరాల్లో సాగైంది. జులైలోనే కోతలు పూర్తిచేసినప్పటికీ 31 శాతం పంట మాత్రమే ఇ-క్రాప్‌లో నమోదు చేశారు. దీనిపై అధికారులను వివరణ కోరగా నువ్వులపంట ఏప్రిల్‌ నుంచే మొదలవుతుందని, జులై నెలాఖరికి పంటచేతికి కూడా అందుతుందని చెబుతున్నారు. అప్పటి వరకు ఇ-క్రాప్‌ యాప్‌ అందుబాటులో లేకపోవడం వల్ల నమోదులో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పంటల రైతులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తుండగా, అధికార యంత్రాంగం సాంకేతిక సమస్యల వల్లే ఇ-క్రాప్‌ నెమ్మదిగా సాగుతోందని చెబుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జులై 30 నుంచి ఇ -క్రాప్‌ నమోదు ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 15లోపు పూర్తిచేయాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. తాజాగా ఈనెలాఖరు వరకు గడువు పెంచినట్టు సమాచారం. ఇ-క్రాప్‌ నమోదులో భాగంగా సంబంధిత రైతుల ఫొటోలను పొలంలోనే తీసి అప్‌లోడ్‌ చేయాలి. ఇకెవైసి కూడా తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వేలాది ఆర్‌బికెలు ఇదే పనిలో ఉండడం వల్ల సర్వర్‌ సహకరించడం లేదని ఆయా సిబ్బంది వాదన. జిల్లాలో చిన్నచిన్న భూ కమతాలు కావడం వల్ల ఉత్తరాంధ్ర మినహా ఇతర జిల్లాలతో పోలిస్తే రైతుల పరిధిలోని సర్వే నంబర్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మన జిల్లా పరిధిలో సుమారు 30.16 లక్షల సర్వే నంబర్లు ఉన్నట్టు సమాచారం. సర్వే నంబర్లు ఎక్కువగా ఉండడం వల్ల ఎంట్రీలకు కూడా ఎక్కువ సమయం పడుతుందని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. ఏదేమైనా పంటలన్నీ సకాలంలో ఇ-క్రాప్‌ నమోదు కాకపోతే రైతులకు తీవ్ర నష్టమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.