ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాలో వడగాల్పులు భారీగా పెరిగాయి. ఎండల తాకిడికి ప్రజలు పగటి సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావడానికి హడలెత్తిపోతున్నారు. సోమవారం గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన వడగాల్పులు మధ్యాహ్నం మరింత పెరిగాయి. వేడితాకిడికి బయటనుంచి ఇళ్లకు చేరే వారు డీలాపడుతున్నారు. కొంతమంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హెల్మెట్, ముఖానికి ఖర్చీఫ్, టోపీ ధరిస్తున్నారు. చెవులకు, తలకు వస్త్రాలు కట్టుకుని ప్రయాణాలు చేస్తున్నారు.
గతేడాది కంటే ఈ ఏడాది మే మూడో వారంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో సోమవారం వడగాల్పులు అధికమయ్యాయి. పొన్నూరులో 45.9, నర్సరావుపేటలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారమూ గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రెండు జిల్లాల పరిధిలో పలు మండలాల్లో 45 డిగ్రీల నుంచి 48 వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
గుంటూరు జిల్లాలో దుగ్గిరాల, కొల్లిపర, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం పొన్నూరులో అత్యధికంగా 45.9, తాడికొండ, గుంటూరులో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దుగ్గిరాల 44.4, కొల్లిపర 44.2, మంగళగిరి 44.1, పెదనందిపాడు 44, తెనాలి 43.7, పెదకాకాని 43.5, కాకుమాను 43, తాడేపల్లి 43.4డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా అత్యల్పంగా వట్టిచెరుకూరులో 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలో 45.8, వినుకొండ, దాచేపల్లి 43.8, అచ్చంపేట 43.7, అమరావతి 43.6 ఉష్ణోగ్రత నమోదైంది.
పల్నాడు జిల్లాలో మంగళవారం అత్యధికంగా 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశంఉందని, వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పల్నాడు జిల్లాలో 28 మండలాల్లో వేడిగాలులుతీవ్రంగా ఉంటాయని తెలిపారు. పట్టణ ప్రాంతాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీధుల్లో పగటి పూట జనసంచారం తగ్గింది. వేసవి తీవ్రతతో మళ్లీ విద్యుత్ వినియోగం పెరగడం, విద్యుత్ పరికరాలు దెబ్బతిని పలు మార్లు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోందని అధికార వర్గాలు తెలిపాయి. వేడిగాలలు తీవ్రతకు పిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.










