మండే ఎండ
- మొదలైన భానుడి భగభగలు
- గతేడాది కంటే 3 డిగ్రీలు అధికం
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి
నంద్యాల జిల్లాలో ఎండ మండుతోంది. మార్చి మొదటి వారంలోనే భానుడి భగభగలు మొదలయ్యాయి. గతేడాదితో పోలిస్తే 3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడిమి నుంచి కాపాడుకోవడానికి జాగ్రత్తలు తప్పవని వైద్యులు సూచిస్తున్నారు...
మార్చి మొదటి వారంలోనే భానుడు భగభగలాగుతున్నాడు. జిల్లాలో వేసవి తీవ్రత ఆరంభమైంది. గత వారం రోజుల నుంచి ఎండ తీవ్రరూపం దాల్చింది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సోమవారం నంద్యాల, చాగలమర్రి, ఆళ్లగడ్డలో అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆత్మకూరులో 36 డిగ్రీలు, డోన్‌లో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది ఇదే సమయానికి అత్యధికంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఈ ఏడాది 3 డిగ్రీల మేర పెరిగింది. మార్చి తొలి వారంలోనే ఇంత తీవ్రంగా ఎండలు కాస్తుంటే రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఉగాది నుంచి మే నెలాఖరు వరకు ఎండలు ఎంత భయంకరంగా ఉంటాయోనని జిల్లా వాసులు భయపడుతున్నారు. ఇప్పటికే ఎండ ధాటికి తట్టుకోలేక నగరంలో మధ్యాహ్నం పూట రోడ్ల మీద జన సంచారం పలుచబడింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ రోడ్ల మీద జనం చాలా తక్కువగా కనిపించారు. అత్యవసర పనుల విషయంలో మినహాయించి మిగతా సందర్భాల్లో రోడ్ల మీదకు వచ్చేందుకు జనం జంకే పరిస్థితి ఏర్పడింది. అవసరమై రోడ్ల మీద తిరిగేవారు ఎక్కువగా చెట్ల నీడను ఆశ్రయిస్తూ కనిపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఎక్కువ ప్రమాదం ఎవరికంటే..
ఎండ సమయంలో బయట ఎక్కువగా తిరగడం వల్ల పిల్లల్లో ఎక్కువగా వడదెబ్బ తగిలే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. చిన్నారులు, వృద్ధులు, గర్బిణులు, క్రీడాకారులు, బాలింతలపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దీర్ఘకాలక వ్యాధులు, స్థూలకాయం ఉన్నవారు, మద్యం ఎక్కువగా తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
జాగ్రత్తలు తప్పవంటున్న నిపుణులు
ప్రజలు బయట తిరిగే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ వంటివి తగలకుండా నీటిని ఎక్కువగా తీసుకుంటూ సాధ్యమైనంత వరకూ నీడలో ఉండాలని సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలిన తరువాత మళ్లీ ఎండలోకి వెళ్లకూడదని, చల్లని నీడలో విశ్రాంతి తీసుకోవాలని అంటున్నారు. బయట తిరిగే సమయంలో తలకు టోపీ పెట్టుకోవాలని, గొడుగు వాడాలని, రోజుకు ఐదు లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలని, సమయానికి ఆహారం తీసుకోవాలని, ఉప్పు కలిపిన ద్రవాలు తాగాలని, శరీరంలో నీటి శాతాన్ని పెంచుకునేందుకు పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు తాగాలని, వదులైన కాటన్ దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు.










