అరచేతి పరిమాణంలో అబ్బురపరిచే పూలు మందారాలు. నిండా మకరందాన్ని పువ్వు మొవ్వులో నింపుకునే ఇది పక్షులకు, కీటకాలకు ప్రియ కుసుమం. దాదాపుగా ప్రతి ఇంటిలోనూ మందార చెట్టు ఉంటుంది. ఒకప్పుడు మందారం అంటే ఐదారడుగులు పెరిగే పెరటిమొక్క. పైగా ఓకే రంగులో పువ్వులు పూసేవి. ఇప్పుడు హైబ్రీడ్ రకంలో కేవలం పదంగుళాలు పొడవున్న చిట్టి పొట్టి మొక్కలు సైతం చారడేసి పువ్వులు పూస్తున్నాయి. వీటిని పూలకుండీల్లోనూ పెంచుకోవచ్చు. మందారాల్లో ఉన్న రకాల గురించి ఈ వారం 'విరితోట'లో తెలుసుకుందాం పదండీ..
మందారపూల చెట్టు ఎప్పుడూ పువ్వులనిస్తూనే ఉంటుంది. పెద్దగా పోషణ అవసరం లేదు. ప్రతి సీజన్‌లోనూ పచ్చగానే కనపడుతుంది. వీటిలో అనేక రకాల పూలమొక్కలున్నాయి. ఒక్కో పువ్వు విభిన్న రంగుల కలబోతతో సుగంధ పరిమళాలు విరజిమ్ముతూ మంత్రముగ్ధుల్ని చేస్తాయి. మందార ఆకులు, పువ్వులు శిరోజాల వృద్ధికి తైలాల్లో వాడతారు. హైబిస్కస్ కుటుంబానికి చెందిన మందారాలు నిత్య పుష్పితాలు.
రేఖ..
నాజూగ్గా ఉండే మందారం రేఖ మందారం. పువ్వు కాస్త చిన్నసైజులో ఉండి, ఐదు రేఖలతో కనువిందుగా ఉంటాయి. నిత్యం మొక్క నిండుగా పువ్వులు విరబూస్తాయి. ఎరుపు, తెలుపు, సింధూరం, కాషాయం, లేత నీలం, పసుపు రంగుల్లో రేఖమందార రకాలు ఉంటాయి. ఈ మొక్కలు ఎర్రమట్టిలో బాగా పెరుగుతాయి. వీటికి కాస్త నీటి వనరు ఎక్కువగా అవసరం.
డబుల్..
పువ్వులోంచి మరోపువ్వు పుట్టుకొస్తున్నట్లుండే అపురూప మందారం డబుల్‌మందారం. దాదాపు అన్ని రంగుల్లోనూ ఈ పువ్వులు పూసే మొక్కలున్నాయి. మందార మొక్కలకు బూజు తెగులు వస్తుంది. వేపనూనె, రసాయనిక మందులుగానీ వాడితే, వెంటనే ఈ తెగులు నుంచి మొక్కని కాపాడు కోవచ్చు.
ముద్ద మనోహరం..
మన సాంప్రదాయ పుష్పాల్లో ముద్దమందారం ఒకటి. సింధూర వర్ణంలో ఒత్తుగా రేఖలు మాదిరిగా మధ్య భాగమంతా అలిమి పొట్లం కట్టినట్టు పువ్వులుండి, పొడవాటి పుప్పొడితో అందంగా ఉంటుంది. ఏ మందార మొక్కైనా తొడిగిన మొగ్గ మూడురోజులు పెరిగి, పువ్వు విచ్చుకుని సాయంత్రానికి వాడిపోతుంది.
బల్బు..
చూడచక్కని మందారపువ్వుల మొక్క బల్బ్ మందారం. పువ్వు చక్కగా బల్బు వెలుగుతున్నట్లుగా ఉంటుంది. పూరేఖల మీద డిజైన్ అత్యద్భుతంగా ఉంటుంది. ఈ పువ్వులు వివిధ రంగుల్లో ఉంటాయి. మొక్కకు పువ్వులు కిందకి వాలి, రమణీయంగా ఉంటాయి. వీటిని కుండీల్లో పెంచుకోవడం శ్రేయస్కరం.
సింధూర..
పువ్వులు సింధూర వర్ణంలో పెద్దపెద్దగా మొక్కకు నిండుగా పూస్తాయి. ఈ మొక్కకు ఇంచుమించు నిత్యం పువ్వులు పూస్తూనే ఉంటాయి.
హైబ్రీడ్..
హైబ్రీడ్ మందారాలు వందల రకాలు ఉన్నాయి. కేవలం ఆరు అంగుళాల ఎత్తులోనే మొక్కలకు పువ్వులు పూస్తాయి. ఎన్నో రంగులు, మరెన్నో డిజైన్లలో పువ్వులు ఎంతో ఆకట్టుకుంటాయి. ఇవి పెద్ద పెద్ద పరిమాణంలో ఉంటాయి.
* చిలకలూరి శ్రీనివాసరావు, 8985945506