గుమ్మలక్ష్మీపురం : గుమ్మ లక్ష్మీపురం ఏజెన్సీ వ్యాధులతో మంచం పట్టింది. ఏ గ్రామం చూసిన జ్వర పీడితులే దర్శనమిస్తున్నారు. నాలుగు నెలల పాటు వ్యాధుల తీవ్రత కనిపిస్తూనే ఉంటుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లో అపారిశుధ్య వాతావరణం, దోమల వ్యాప్తి, కలుషిత నీరు కారణంగా గిరిజనులు వ్యాధుల బారిన పడుతున్నారు. వైద్యం కోసం వస్తున్న రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. స్థానికసామాజిక ఆరోగ్య కేంద్రంలో రోజువారి ఓపి 150కి పైగా నమోదవుతూనే ఉంది. ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలతో రోగులు వైద్యం కోసం వస్తున్నారు. వీరిలో ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, గర్భిణీలు, వృద్ధులే ఎక్కువ. రోగుల సంఖ్య పెరగడంతో గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన వస్తోంది. మరోవైపు మారుమూల ప్రాంతాలైన దుడ్డు ఖల్లు, రేగిడి, తాడికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కూడా ఆయా ప్రాంతాల నుంచి గిరిజనులు పెద్దసంఖ్యలో వైద్యం కోసం వస్తున్నారు. అయితే ఆసుపత్రిలో కనీస సౌకర్యాల్లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం కురుపాం, పార్వతీపురం వంటి దూరప్రాంతాలకు వెళ్లి వైద్యం పొందుతున్నారు. కొండలపై గ్రామాల్లో గిరిజనులకు వైద్య సేవలు నేటికీ గగనమవుతోంది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో రోగులను డోలీల సాయంతో తీసుకొస్తున్న పరిస్థితి. ఆశ్రమ పాఠశాలల్లో ఎఎన్‌ఎం పోస్టులు నియామకం లేకపోవడంతో స్థానికంగా విద్యార్థులకు వైద్యమందడం లేదు. దీంతో సమీపంలో ఉన్న ఆసుపత్రులకు తీసుకువచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏజెన్సీ లో వైద్య సేవలు మెరుగుపరచాలని గిరిజన ప్రజలు కోరుతున్నారు.
రోగులతో కిక్కిరిసిన ఏరియా ఆసుపత్రి
సీతంపేట : ఏజెన్సీలో వైరల్, మలేరియా, డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇటీవల కాలంలో తీవ్రంగా ఎండలు కాయడంతో పాటు వర్షాలు కురవడంతో కలుషిత జలాలు తాగడంతో గిరిజనుల ప్రాణాల మీదకు కొని తెచ్చుకుంటున్నారు. ప్రతి గిరిజన గ్రామంలో వైరల్ జ్వరాలు ఉన్నాయి. దీంతో స్థానిక ఏరియా ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతోంది. రోజూ 400 వరకు ఓపి ఉన్నప్పటికీ వీటిలో 30 వరకు వైరల్ జ్వరాలతో గిరిజనులు బాధపడుతున్నారు. వీటిలో సీతంపేట, దోనుబాయి, కోసమానుగూడ, చిన్నపల్లకి, పెద్దపల్లంకి తదితర గ్రామాల్లో జ్వరాలతో బాధపడుతున్నారు. ఇప్పటికే చిన్న పల్లకిలో మలేరియా పాజిటివ్ నమోదైంది. స్థానిక ఏరియా ఆస్పత్రిని అప్ గ్రేడ్ చేసినా ఇంకా 30 పడకలతోనే నిర్వహణ జరుగుతుంది. ఇప్పటికే రోగులు తాకిడి ఎక్కువగా ఉండడం, పడకల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు చొరవతో ఎన్‌ఆర్‌సి నుంచి అదనంగా 24 బెడ్‌లను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, కుసిమి పిహెచ్‌సి పరిధిలో కుసిమి, కోడిశ తదితర గ్రామాల నుంచి వైరల్ జ్వరాలతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నాయి. ధోనుబాయి పిహెచ్‌సి పరిధిలో వారం రోజుల క్రితం చిన్న పల్లంకి, పెద్ద పల్లంకిలో నాలుగు మలేరియా కేసులు నమోదయ్యాయి. అలాగే ధోనుభాయి, టీటికిపాయిలో మూడు మలేరియా కేసులో నమోదయ్యాయి. దోమతెరలు వాడకపోవడం, పారిశుధ్యం లోపించడం వంటిపై అవగాహన కల్పించకపోవడంతో జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఇదిలా ఉండగా చిన్నపిల్లలకు అత్యవసర వైద్యం అందించాలనే ఉద్దేశంతో రోగుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ రిఫర్ చేయకుండా కొన్ని సందర్భంలో ఒకే బెడ్‌పై ఇద్దరికి వైద్యం అందించాల్సిన పరిస్థితి వస్తుంది.
ముందస్తు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి : సిపిఎం
కురుపాం : ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందస్తుగా గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అన్నారు. మంగళవారం స్థానిక రావాడ జంక్షన్ కాంప్లెక్స్ వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో ఎక్కువ మంది గిరిజనులు మలేరియా, డెంగీ తదితర వ్యాధుల బారిన పడుతున్నారని, గతంలో అనేకమంది గిరిజనులు ఈ వ్యాధులు బారిన పడి సరైన వైద్యం అందక మృత్య వాత పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందుస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపర్చాలని, ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని కోరారు. నియోజకవర్గ కేంద్రాలైన కురుపాం, పాలకొండ, సాలూరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను త్వరగా నిర్మించినట్లయితే గిరిజనులకు వైద్య సేవలు మరింత చేరువులో ఉంటాయన్నారు. కావున తక్షణమే ఆ దిశగా ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోలక అవినాష్, ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










