ప్రజాశక్తి-నందిగామ : నందిగామ డివిఆర్ కాలనీలో మంచినీటి ఎద్దడి నివారించాలని మహిళలు ఖాళీ బిందెలతో గురువారం టిడిపి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నందిగామ మాజీ ఎంఎల్‌ఎ తంగిరాల సౌమ్య మాట్లాడుతూ మద్యం ఏరులై పారుతుందని, మంచినీరు మాత్రం దొరకడం లేదన్నారు. ప్రజల అర్థనాదాలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వినబడడం లేదన్నారు. నందిగామ పట్టణంలో రమణ కాలనీ నందు గత 25 రోజులుగా తాగునీరు లేక అల్లాడుతున్న ప్రజల ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్లు, మహిళ నేతలు, తెదేపా నేతలతో కలసి వాటర్ ట్యాంక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. 17,18 వార్డులలో మంచినీరు వచ్చి 25 రోజులు అయ్యిందన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నందిగామలో ఇంటింటికీ కుళాయి ఇవ్వాలని చాలా ప్రతిష్టాత్మకంగా 90 కోట్ల ప్రాజెక్ట్ తీసుకువచ్చామని,ఆ ప్రాజెక్ట్ ను రివర్స్ టెండరింగ్ పేరుతో 4 ఏళ్ల నుండి కనీసం కోటి రూపాయల పని కూడా చేయలేదన్నారు.










