May 20,2023 23:04

దుర్వాసన వస్తున్న వైనం
తాగునీరు అందని పరిస్థితి
పట్టించుకోని పంచాయతీ అధికారులు
ప్రజాశక్తి - మండవల్లి

         మంచినీటి చెరువులో చేపలు చనిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. పురుగులు పడుతున్నా పంచాయతీ అధికారులు తొలగించకపోవడంతో మంచినీటి వనరులు పాడై వ్యాధులు ప్రబలుతాయని మండల కేంద్రమైన మండవల్లి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం... గ్రామస్తుల దాహార్తిని తీర్చేందుకు ప్రధాన సెంటర్‌లో సుమారు ఎకరాల మొగలాయి చెరువు, మరో ఐదు ఎకరాల కొండరాయి చెరువులు ఉన్నాయి. మొగలాయి చెరువులో నీటిమట్టం తగ్గడంతో నీరు పచ్చగా మారి చేపల చెరువును తలపిస్తుంది. అంతేకాకుండా ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉండడంతో అందులో ఉన్న చేపలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో మంచినీటి చెరువు దుర్వాసన వెదజల్లుతుంది. చేపలు చనిపోతున్నాయని పంచాయతీ పాలకులకు, అధికారులకు ఐదు రోజుల క్రితమే గ్రామస్తులు సమాచారం అందించారు. అయినప్పటికీ చనిపోయిన చేపలను తొలగించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే నీటిని గ్రామానికి కుళాయిల ద్వారా సరఫరా చేస్తుండడంతో వ్యాధులు ప్రబలుతాయని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఆర్‌ఒ ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు. వేసవి కావడం, చెరువులో చేపలు చనిపోయి నీరు కలుషితమవ్వడం ఇదే అదునుగా భావించిన ఆర్‌ఒ ప్లాంట్‌ దారులు 20 లీటర్ల క్యాన్‌ను రూ.20 నుంచి రూ.25 వరకు పెంచి మరీ అమ్మకాలు చేస్తున్నారు. దీంతో ఆర్‌ఒ నీటిని కొనుక్కోలేక, చేపలు మృత్యువాత పడి చెరువులోని నీటిని తాగలేక నాన అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి చెరువులో చనిపోయిన చేపలను తొలగించి నీటిని క్లోరినేషన్‌ చేయించి స్వచ్ఛమైన నీటిని గ్రామానికి సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి టి.శ్రీనివాసన్‌ను వివరణ కోరగా మృత్యువాత పడిన చేపలను తొలగించాలని సర్పంచికి తెలియజేశానని చెప్పారు. పరిశీలించి చనిపోయిన చేపలను తొలగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.