
ప్రజాశక్తి-ఎటపాక
మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ పరిధి మాధవరావుపేటలో తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ గ్రామంలో మంచినీళ్ల కష్టాలు తీర్చాలని సిపిఎం మండల కార్యదర్శి ఐ.వెంకటేశ్వర్లు (ఐవి) డిమాండ్ చేశారు. గ్రామంలో తాగునీటి సమస్యపై గ్రామస్తులు సిపిఎం దృష్టికి తీసుకురాగా, మంగళవారం ఐవి, ఇతర నాయకులు గ్రామాన్ని సందర్శించారు. తమ గ్రామంలో జల్ జీవన్ మిషన్ పేరుతో పైపులైన్లు వేసి మంచినీటి కనెక్షన్ ఇవ్వకుండా వదిలేశారని, ఇప్పటికే ఉన్న ట్యాంకు నుండి కొన్ని కుటుంబాలకు కనెక్షన్ ఇచ్చారని గ్రామ గిరిజనులు తెలిపారు. కాని చాలా కుటుంబాలకు కనెక్షన్ ఇవ్వకుండా వదిలేయడం వల్ల, వారికి నీటి సరఫరా లేక మంచినీళ్లు రాక ఉన్న బోర్లు కూడా సరిగా పనిచేయక తాగునీటి కొరకు చాలా కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పని చేసుకుని పొద్దుపోయిక వచ్చేసరికి తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న తమ పరిస్థితిని సిపిఎం నాయకులకు వివరించారు. దీంతో సిపిఎం గ్రామాన్ని సందర్శించిన సిపిఎం నాయకులు మంచినీటి కష్టాలను తొలగించడం కొరకు అక్కడి నుండే పంచాయతీ సెక్రెటరీ, ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈలతో మాట్లాడారు. కానీ వారి నుండి స్పష్టమైన హామీ రాలేదు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఐవి మాట్లాడుతూ అధికారులు మాధవరావుపేట గ్రామాన్ని వెంటనే సందర్శించి గిరిజన ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం స్థానిక నాయకులు కాకా వెంకటేశ్వర్లు, అప్క శ్రీను, కనితి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.