అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో అందరూ వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు. ఒకరోజు ఆ ఊరిపెద్ద ఊళ్ళో అందరినీ ఒకచోట సమావేశపరిచాడు. 'వానాకాలం మొదలైంది. పొలం పనులు సాగుతున్నాయి. మన ఊరిగుండా ఒక పెద్ద రహదారి పోతుంది. అలాగే ఊళ్ళో సిమెంటు రహదా రులు కూడా ఉన్నాయి. దమ్ముచక్రాలతో ట్రాక్టర్లను రహదార్లపై ఎవరూ నడపవద్దు. దానివల్ల రహదార్లు పాడైపోతాయి. ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతుంది' అని చెప్పాడు. ఊరంతా ఆయన మాటకు విలువనిచ్చి, చెప్పినట్లే చేశారు.
రంగడు అనే రైతు మాత్రం 'ఊరిపెద్ద అయినంత మాత్రాన ఆయన మాట వినాలా? నాకేమి అవసరం?' అనుకుంటూ యథావిధిగా తన ట్రాక్టరును దమ్ముచక్రాలతో రహదార్లపై నడుపుతున్నాడు. ఊరి పెద్ద ఎన్నిసార్లు చెప్పినా రంగడు ఆయన మాట వినలేదు. ఒకరోజు రంగడు ట్రాక్టరుతో పొలం దున్నుతున్నాడు. ఒక వ్యక్తి పరుగుతీస్తూ 'రంగడు.. రంగడూ..' అంటూ కేకలు పెడుతూ పొలంలోకి వచ్చాడు. 'ఏమైంది? ఎందుకలా చావుకేకలు వేస్తున్నావు?' అని రంగడు అతన్ని అడిగాడు. 'నీ కొడుక్కి పెద్ద ప్రమాదం జరిగింది. ఒళ్లంతా ఒకటే రక్తం. త్వరగా ఇంటికి రా!' అంటూ తొందర చేశాడు. తన కొడుక్కి ఏమైందోనని రంగడు ఊర్లోకి పరుగులు తీశాడు. కొడుకు ఒళ్లంతా రక్తం కారడం చూసి కన్నీరుమున్నీరయ్యాడు. 'అసలేమైంది?' అని అక్కడున్నవారిని రంగడు అడిగాడు.
'మేమేమి చెప్తాం. అంతా నీ వల్లే జరిగింది. దమ్ముచక్రాలతో రహదారిపై ట్రాక్టర్లు నడపవద్దని చెప్పిన ఊరిపెద్ద మాటలను పెడచెవిన పెట్టావు. అందుకే నీ కొడుక్కి ఈ కష్టం వచ్చి పడింది. దమ్ముచక్రాలతో రహదారిపై నడపడం వల్ల రేగడి చేరింది. రాత్రి నుండీ పడుతున్న సన్నచినుకు వల్ల అది కాస్తా అడుగేస్తే జారేలాగా తయారైంది. సైకిలు తొక్కుతూ వెళ్తున్న నీ కొడుకు రేగడిలో జారి కిందపడ్డాడు. కాళ్ళూచేతులు కొట్టుకుపోయాయి. చూడు ఎలా రక్తం కారుతోందో? బట్టలూ చిరిగిపోయాయి. ఇంకానయం కాలోచెయ్యో విరగలేదు' అంటూ తలో మాట అన్నారు.
ఇదే పరిస్థితి ఇంతకు ముందు ఆ రహదారిపై వెళ్ళిన చాలామందికి ఎదురైంది. ఊరి పెద్ద చెప్పిన మాటలు అప్పుడు రంగడికి గుర్తొచ్చాయి. తాను చేసిన పనికి పశ్చాత్తాపం పడ్డాడు. 'మంచిమాట విలువ అర్థమైంది. మరోసారి ఇలాంటి పని చేయన'ని అందరికీ మాటిచ్చాడు. కొడుకుని వెంటనే చికిత్స కోసం వైద్యుని దగ్గరకు తీసుకెళ్లాడు.
* కళ్ళేపల్లి తిరుమలరావు, 9177074280